జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి నిధులను వ్యవసాయ శాఖ కమిషనరేట్ వ్యక్తిగత ఖాతాలకు(పీడీ) పంపిణీ చేయడాన్ని తప్పుబట్టింది. అంతేకాకుండా ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను తిరిగి జమ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కట్టడికి వినియోగించాల్సిన ఎస్డీఆర్ఎఫ్‌కు చెందిన రూ.1100 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించిందంటూ పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. న్యాయమూర్తులు నిధుల మళ్లింపుపై కాగ్ సమర్పించిన రిపోర్టును పరిశీలించారు.
ఎస్డీఆర్‌ఎఫ్ నుంచి తాము మళ్లించిన నిధులు.. 2020 మార్చికి ముందువని రాష్ట్రప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే నిధులు ఎప్పటివైనా అలా ఎలా మళ్లిస్తారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కరోనా మళ్లీ విజృభిస్తే నిధులు లేకుండా ఏం చేస్తారంటూ ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించింది.
కరోనా బాధిత కుటుంబాలకు పంపిణీ కోసం ఉద్దేశించిన నిధులను సంక్షేమ పథకాల కోసం వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అలా మళ్లించడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. రెండు వారాల్లోగా మళ్లించిన రూ.1100 కోట్ల నిధులు తిరిగి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా లబ్ధిదారుల నుంచి దరఖాస్తు స్వీకరించిన 4 వారాల్లోగా క్లైమ్ పూర్తిచేయాలంటూ ఆదేశించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.