పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్.., పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ ఫుల్.. ఈ రెండు మాటలు అందరికీ తెలిసినవే. కానీ.., “పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ పీపుల్ పవర్ ఫుల్”.. ఈ మాటకి అర్ధం తెలియాలంటే వస్త్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న తుమ్మిడి రామ్ కుమార్ ప్రస్థానం గురించి తెలుసుకోవాలి.
తుమ్మిడి రామ్ కుమార్.. వస్త్ర రంగ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ పేరే ఒక బ్రాండ్. అయితే.., ఇంత స్థాయికి చేరడానికి రామ్ కుమార్ అనేక ముళ్ల మార్గాలని దాటాల్సి వచ్చింది. పుట్టుకతోనే ఆస్తిగా వచ్చిన పేదరికం ఆయన చదువుని చిదిమేసింది. తండ్రి మంచితనం, మొహమాటం కష్టానికి తగ్గ ఫలితం రాకుండా చేసింది. ఇలాంటి స్థితిలో.. 11 ఏళ్ళ వయసులోనే ఆ ఉమ్మడి కుటుంబ భారాన్ని మోయడానికి రామ్ కుమార్ అడుగులు ముందుకి పడ్డాయి. అలా.. 1968 లో ఓ బట్టల కొట్టులో ఆయన గుమస్తాగా పనిలో కుదిరారు. రోజుకి అర్ధ రూపాయి జీతం. ఇంట్లో అందరి ఆకలి తీరడానికి ఆ అర్ధ రూపాయి చాలు!
సరిగ్గా నాలుగేళ్లు తిరిగే సరికి రామ్ కుమార్ కి వ్యాపారంలో మెళుకువలు తెలిశాయి. తానే సొంతగా బట్టలు కుట్టి, వాటిని అమ్మడం ప్రారంభించాడు. ఆ సమయంలో రామ్ కుమార్ నిద్ర లేకుండా గడిపిన రాత్రులకు లెక్కే లేదు. ఫుట్ పాత్ పై బట్టలు అమ్మే ఆ సాధారణ కుమార్ పై అందరికి నమ్మకం కుదిరింది. సరిగ్గా.. ఆ సమయంలో ఓ పార్ట్నర్ దొరకడంతో కేవలం 1000 రూపాయల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ఇంకాస్త విస్తరించారు రామ్ కుమార్. కాస్త.. నిలదొక్కుకుంటున్న సమయంలో పార్ట్నర్ వ్యాపారం నుండి తప్పుకున్నాడు. ఆలోపే చెల్లి పెళ్లి చేయాల్సి వచ్చింది. సంపాదించిన నాలుగు రూపాయలు అయిపోయాయి. కానీ.., రామ్ కుమార్ అధైర్య పడలేదు. తన దగ్గర గుమస్తాగా పని చేసిన వారి దగ్గరే మళ్ళీ గుమస్తా చేరారు.
చేతిలో డబ్బు లేకపోయినా.., రామ్ కుమార్ అంటే నిజాయతీ అన్న ఒక బ్రాండ్ మార్కెట్ లో ఉంది. ఆ నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని రామ్ కుమార్ మళ్ళీ తన వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఈసారి విజయం ఆయనకి దాసోహం అయ్యింది. నాణ్యమైన సరుకుని ప్రజలకి అందుబాటు ధరలో అందించడంతో.. గోదావరి జిల్లాలలో తుమ్మిడి రామ్ కుమార్ పేరు మారు మ్రోగిపోయింది. ఆ గుడ్ విల్ తో రామ్ కుమార్ తన షాప్స్ పెంచుకుంటూ పోయారు.
2002 వరకు రామ్ కుమార్ ప్రయాణం సాఫీగానే సాగిపోయింది. కానీ.., సరిగ్గా ఆ సమయంలో తన దగ్గర పని చేసే గుమస్తాలు యూనియన్ గా ఏర్పడ్డారు. అక్కడ నుండి వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. సేల్స్ దారుణంగా పడిపోయాయి. తన సిబ్బందిని ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో.. ఉన్న గుడ్ విల్ ని పోగోట్టుకోలేక ఆయన తన మొత్తం వ్యాపారాన్ని లాక్ డౌన్ చేసేశారు. ఆ సమయంలో ఎదురైన కొన్ని అవమానాల కారణంగా.. రామ్ కుమార్ తల్లిగారు కూడా కన్ను మూయడం విషాదకరమైన విషయం.
ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా రామ్ కుమార్ వెనకడుగు వేయలేదు. మళ్ళీ కొత్త లైసెన్స్ తో తుమ్మిడి బ్రదర్స్ ని.. మీ తుమ్మిడి బ్రదర్స్ గా పేరు మార్చి.. సరికొత్తగా వ్యాపారం స్టార్ట్ చేశారు. ఈ ప్రయత్నంలో కూడా ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. తండ్రి చివరి చూపుకి కూడా నోచుకోకుండా కష్టపడ్డ రామ్ కుమార్ జీవితంలో.. ఆయనకి అన్నీ వేళల అండగా నిలబడింది మాత్రం ఆయన సతీమణి. ఆ ఉమ్మడి కుటుంబానికి ఆమె అమ్మలా మారి, భర్తకి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.
తుమ్మిడి రామ్ కుమార్ కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక సేవలోనూ ఆయన తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మూగజీవాలకు హాస్పిటల్స్ కట్టించడం, ట్రైబుల్, బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఆడపిల్లల చదువులని ప్రోత్సహించడం, మదర్ థెరీసాతో కలసి వివిధ సామజిక సేవల్లో పాలు పంచుకోవడం, తరువాత కాలంలో తుమ్మిడి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్మించి.. విద్యార్థులకు హాస్టల్స్ కట్టించడం, స్కూల్స్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆలయాల పునరుద్ధరణ కోసం పాటుపడటం వంటి గొప్ప కార్యక్రమాలు చేశారు. ఇదే సమయంలో రాజకీయాల్లోను తుమ్మిడి రామ్ కుమార్ తన సత్తా చాటారు. పివి. నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి లాంటి దిగ్గజ నాయకులతో కలసి పని చేసిన అనుభవం రామ్ కుమార్ సొంతం. ఈ మొత్తం ప్రయాణంలో ఆయన్ని అలంకరించి మురిసిపోయిన పదవులు ఎన్నో.
ఇలా.. ఒక సామాన్య నిరుపేదగా మొదలైన తుమ్మిడి రామ్ కుమార్ ప్రయాణం.. ఈరోజు ఈ స్థాయికి చేరింది అంటే.. ఆయన నిజాయతీ, మంచితనం, కార్యదక్షత కారణం అని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం ప్రయాణంలో ఆయన ఎదగడమే కాకుండా, తనతో పాటు.., కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. మరి.. చూశారు కదా? ఇది.. తుమ్మిడి రామ్ కుమార్ ప్రస్థానం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.