‘మీరూ, సైన్స్ మాస్టర్ తమను భయంకరంగా విసిగిస్తున్నారు. మీ నుంచి తప్పించుకోవడానికి, మిమ్మల్ని చంపేద్దామని కత్తులు తీసుకుని వచ్చాం’ అని విద్యార్థులు తెలిపారు. ఈ ఘటన బాపట్లలో చోటు చేసుకుంది.
పిల్లలు సరిగ్గా చదవకుంటే.. ఉపాధ్యాయులు దండించి దారిన పెట్టే రోజులు పోయాయి. ఇప్పుడు విద్యార్థులకే ఉపాధ్యాయులు భయపడే రోజులు వచ్చినట్లు ఉన్నాయి. ప్రత్యేక తరగతుల పేరుతో వేధిస్తున్నారంటూ ఏకంగా ఉపాధ్యాయులను చంపేడానికే విద్యార్థులు పథకం వేశారు. ఈ షాకింగ్ సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశాయిపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులను నిత్యం క్లాసులు తీసుకుంటూ, బాగా చదవమని విసిగిస్తున్నారని, దీంతో భరించలేని ఇద్దరు విద్యార్థులు ఉపాధ్యాయులను ఎలా కంట్రోల్ చేయాలని ఒక స్కెచ్ వేశారు. కొంత డబ్బు సమకూర్చుకొని రెండు కత్తులు కొనుగోలు చేసి, వారి స్కూల్ బ్యాగ్ లలో జాగ్రత్తగా స్కూల్ కి తీసుకొచ్చారు. తరగతి గదిలోనే ఆ ఉపాధ్యాయులను నరికేయాలని ప్లాన్ చేశారు.
కాగా.. అదే తరగతిలోని ఓ విద్యార్థిని వారి కదళికల్లో మార్పు గమనించింది. ప్రమాదాన్ని గ్రహించిన ఆ అమ్మాయి వెంటనే తన స్నేహితులతో చెప్పింది. ఇద్దరూ నిశ్చయించుకొని హెడ్ మాస్టర్ వద్దకు వెళ్లి, వారికున్న భయాన్ని వెల్లడించారు. వారిద్దరిపై తమకు ఏదో అనుమానంగా ఉందని చెప్పారు. వెంటనే స్పందించిన హెడ్ మాస్టర్ హుటాహుటిన వెళ్లి వారి బ్యాగులు వెతకగా.. ఆ ఇద్దరి వద్ద రెండు పదునైన కత్తులు దొరికాయి. దీంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఖంగుతిన్నారు. ఈ ఘటనతో భయపడిన విద్యార్థులు.. తరగతి గదిలో భయంతో కేకలు పెట్టారు.
హెడ్‌మాస్టర్ ఆ ఇద్దరు విద్యార్థులను తన ఆఫీస్ రూమ్‌కు తీసుకెళ్లి, ఇలా ఎందుకు చేశారని, కత్తులతో స్కూల్‌కు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా.. ఆ విద్యార్థులు అసలు విషయం బయటపెట్టారు. ‘మీరూ, సైన్స్ మాస్టర్ తమను భయంకరంగా విసిగిస్తున్నారు. మీ నుంచి తప్పించుకోవడానికి, మిమ్మల్ని చంపేద్దామని కత్తులు తీసుకుని వచ్చాం’ అని తెలిపారు. విద్యార్థులు అసలు విషయం చెప్పిన తర్వాత ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు స్పృహ తప్పి పడిపోయినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. విద్యార్థుల తెలియని తనంతో అలా చేసిఉంటారని, వారికి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుందని ఇతర ఉపాధ్యాయులు భావించినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.