“ఆవు చేలో మేస్తే దూడ గట్టున్న మేస్తుందా!” అనే సామెతను పెద్దలు ఊరికే చెప్పలేదు. సమాజంలో పెద్దలు చేసే పనులు పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఆ సామెత పుట్టుకొచ్చింది. పెద్దలు మంచి మార్గంలో పయనిస్తే వారి పిల్లలు అదే మార్గంలో వెళ్తారు. అదే విధంగా కోపం, అసూయ వంటివి విషయాల్లోనూ పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది. మంచైనా, చెడైనా పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటనే దానికి ఉదాహరణ. తన తండ్రి మద్యం తాగడం చూసి ఓ పాఠశాలలో విద్యార్థి తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాళ్లకు టీసీలు ఇచ్చి పంపించేశారు.
వివరాల్లోకి వెళ్తే… కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు గురువారం మధ్యాహ్న భోజన సమయంలో రెండు మద్యం సీసాలను తెచ్చుకుని తాగారు. వారి ప్రవర్తనలో తేడాను గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. ఆ ఐదుగురు విద్యార్థులను హెచ్ఎం ఓ గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం వారి తల్లిదండ్రలను పిలిపించి, వారి సమక్షంలోనే మద్యం సీసాలు ఎక్కడివని ప్రశ్నించారు. తెలిసిన వాళ్లు డబ్బులు ఇస్తే మద్యం కొనుకున్నామని తెలిపారు. మద్యం ఎందుకు తాగారు అని ఓ ఉపాధ్యాయుడు అడిగితే… ప్రతిరోజు ఇంటికి తన తండ్రి మద్యం బాటిల్ తెచ్చుకుని తాగుతాడని, అలా ఆయనను రోజూ చూసి.. తనకు తాగాలనిపించిందని ఓ విద్యార్థి చెప్పాడు. విద్యార్థి చెప్పిన ఈ సమాధానికి అక్కడి వారందరూ అవాక్కయ్యారు. ఆ విద్యార్థి తండ్రి ప్రభావానికి లోనుకావడం, మిగతా నలుగురు విద్యార్థులు తోడవ్వడం వల్ల ఇలాంటిది జరిగిందని ఉపాధ్యాయులు గ్రహించారు. ప్రధానోపాధ్యాయుడు ఆ పిల్లలను మందలించి తల్లిదండ్రుల సమక్షంలో టీసీలిచ్చి ఇళ్లకు పంపించేశారు.
“ఈ విద్యార్థులను చూసి మిగతావాళ్లు కూడా దారితప్పే ప్రమాదం ఉంది. అందుకే వాళ్లకు టీసీలిచ్చి పంపించేశాం. పైగా ఆ విద్యార్థులు ఇక్కడే ఉంటే మిగతా పిల్లలు వారిని హేళన చేయవచ్చు. ఆ పిల్లల్ని పాఠశాలలో ఉండనిస్తే ఎలాంటి తప్పు చేసినా ఏమనరులే అనే భావన విద్యార్థులందిలో కలగవచ్చు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చాం. పిల్లలకు టీసీలు ఇచ్చాం” అని హెచ్ఎమ్ సక్రుం నాయక్ తెలిపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.