వీధి కుక్కల దాడికి మరో ప్రాణం బలైంది. 8 కుక్కలు చేసిన మూకుమ్మడి దాడిలో 15 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న పాప విగతజీవిగా మారింది. అమ్మా అని కూడా పిలవకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో ఈ విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకు తల్లిదండ్రులు, నాయనమ్మతో ఆడుకున్న ఆ చిన్నారి విగతజీవిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పసికందు వీధికుక్కులకు ఆట వస్తువుగా మారిపోయింది. చిన్నారిని తోటలోకి లాక్కెళ్లి అతి క్రూరంగా దాడి చేశాయి. ఆస్పత్రికి తరలించేలోపే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి అన్యాయం మరో కుటుంబానికి జరగకూడదు అంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చనిపోయిన చిన్నారి పేరు సాత్విక(15 నెలలు). శుక్రవారం సాయంత్రం నాయనమ్మ, అక్క కుసుమతో కలిసి రోడ్డు మీదకు వచ్చింది. పెద్దమ్మాయికి సాత్వికను అప్పజెప్పి నాయనమ్మ పక్కకు వెళ్లింది. అదే అదునుగా 8 కుక్కల ఆ చిన్నారిపై దాడికి దిగాయి. పెద్దమ్మాయి కేకలు వేయడంతో నాయనమ్మ పరుగున వచ్చింది. అప్పటికే సాత్వికను కుక్కులు ఈడ్చుకెళ్లాయి. దాదాపు 70 మంది గ్రామస్థులు సాత్విక ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలించారు. ఎంతకీ వారికి సాత్విక కనిపించలేదు. దాడి జరిగిన ప్రదేశానికి వెనుక వైపే తోట ఉండటంతో కుక్కులు చిన్నారిని అక్కడికి లాక్కెళ్లాయి.
పాప ఆచూకీ తెలుసుకుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె లేదని తెలుసుకుని ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయ్యింది. వీరికి వచ్చిన కష్టాన్ని చూసి ఊరు ఊరే రోధించింది. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడదతో అసలు రోడ్ల మీద తిరిగే వల్ల లేదంటూ వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి ఒక ఘటన మళ్లీ జరగకుండా, ఈ కష్టం మరో కుటుంబానికి రాకుండా చూడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.