బస్సులో మర్చిపోయిన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను ప్రయాణికురాలికి అందించి నిజాయితీ చాటుకున్నారు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్. ఈ సంఘటన వివరాలు..
నిజం, నిజాయితీ అనే పదాలు వినిపిస్తున్నాయి.. కానీ చేతల్లో మాత్రం కనుమరుగు అవుతున్నాయి. రోడ్డు మీద రూపాయి కనిపించిందా.. ఎవరన్నా చూస్తున్నారా అని గమనించి.. టక్కున ఆ రూపాయి తీసుకుని చక్కా పోతాం. రూపాయి దగ్గరే ఇలా ఉంటే.. ఇక పెద్ద మొత్తంలో దొరికితే.. అబ్బా.. ఈ రోజు నక్కను తొక్కాను అనుకుంటూ.. ఆ మొత్తాన్ని చేత పట్టుకుని పోయేవారే చాలా మంది. కానీ అక్కడక్కడా కొందరు నిజాయితీపరులుంటారు. పరుల సొమ్ము పాముతో సమానం.. తాము కష్టపడి సంపాదించిన పావలా అయినా సరే.. చాలు అనుకుంటారు. అలాంటి వారికి కోటి రూపాయలు దొరికినా సరే.. దానిపై ఆశపడరు. పాపం ఎవరిదో ఈ సొమ్ము.. పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నారో కదా అని ఫీలవుతారు. తిరిగి ఆ సొమ్మును పోగొట్టుకున్నవారికే అప్పగిస్తారు. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది.
బస్సులో మర్చిపోయిన 50 తులాల బంగారాన్ని బాధితులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఆర్టీసీ బస్ డ్రైవర్, కండక్టర్. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకుంది. విశాఖపట్నం కాంప్లెక్స్‌లో ఆర్టీసీ బస్సులో పలాస డిపోకు చెందిన ఏపీ 30 జెడ్ 0070 నంబర్ బస్సు ఆగి ఉంది. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన శోభారాణి ప్రయాణం నిమిత్తం ఆ బస్ ఎక్కి.. తన లగేజీ బ్యాగు బస్‌లో ఉంచింది. త తర్వాత ఏదో పని గుర్తుకు వచ్చి కిందకు దిగంది. అయితే ఆమె బస్ దిగే విషయం కండక్టర్, డ్రైవరుకు చెప్పకుండా కిందికి దిగి వెళ్లిపోయింది.
పని చూసుకుని తిరిగి వచ్చే సరికి.. ఆమె లగేజ్ పెట్టిన బస్సు అక్కడ లేదు. తన లగేజ్‌లో భారీగా అంటే సుమారు 50 తులాల బంగారం ఉంది. వెంటనే ఆమె ఈ విషయం గురించి అక్కడే ఉన్న టెక్కలి డిపో కండక్టర్ ధనుంజయకు ఆ విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన పలాస ఆర్టీసీ డిపో సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే డిపో నుంచి ఆ బస్సు కండక్టర్ ఆర్.వి.రావుకు సమాచారం అందించారు. ఆయన డ్రైవర్‌తో కలిసి బ్యాగును గుర్తించి భద్రపరిచారు. అనంతరం పలాసలో డిపో మేనేజర్‌కు బ్యాగ్‌ను అందజేశారు.
బ్యాగ్ దొరికిందన్న సమాచారం అందుకున్న శోభారాణి శుక్రవారం మధ్యాహ్నం డిపోకు వచ్చారు. రూ.35 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, దుస్తులు ఉన్న బ్యాగును తీసుకున్నారు. బంగారం, బ్యాగును జాగ్రత్తగా భద్రపరిచిన డ్రైవర్ ఎన్.హెచ్.ప్రసాద్, కండక్టర్ ఆర్.వి.రావులను డిపో మేనేజర్ వి.శ్రీనివాస అభినందించారు. పోయిందనుకున్న బంగారం దొరకడంతో శోభారాణి సంతోషం వ్యక్తం చేశారు. తన లగేజ్ తిరిగి అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.