కుమారుడి కోసం జీవితాన్ని ధారపోసి.. కష్టపడి చదివించి.. పెంచి పెద్ద చేశాడు ఆ తండ్రి. నాన్న కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆ వ్యక్తి.. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇన్నాళ్లు తన కోసం కష్టపడిన తండ్రిని ఇక మీదట బాగా చూసుకోవాలని భావించాడు. అలానే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. జీవితంలో స్థిరపడిన కొడుకు.. మంచి కోడలు, మనవడితో కాలక్షేపం చేస్తూ.. జీవిత చరమాంకంలో హాయిగా గడిచిపోతుంది. సంతోషంగా సాగిపోతున్న వారిని చూసి విధికి కన్నుకుట్టుంది. ఇన్నాళ్లు అవిశ్రాంతంగా శ్రమించి.. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని భావించిన తండ్రికి.. శాశ్వత నిద్ర ప్రసాదించింది విధి. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న ఆ కుటుంబంలో వారం రోజుల వ్యవధిలోనే మరో విషాదం చోటు చేసుకుంది. తండ్రి స్థానంలో కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడని భావించిన కొడుకు కూడా మృతి చెంది.. ఆ కుటుంబంలో తీరని విషాదం నింపాడు. ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని శుభలయ్యా ఆర్‌ఆర్ కాలనీకి చెందిన సూర్యా రావు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పని చేస్తూ ఉండేవారు. ఇక ఆయన కుమారుడు లలిత్ సాగర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య, 9 నెలల చిన్నారి ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సూర్యారావు గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియలు చేసేందుకు శుక్రవారం ఉదయం లలిత్ సాగర్.. వంశధార నది, గొట్టా బ్యారేజీ వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో బ్యారేజీ వద్ద స్నానం చేస్తూ.. నదిలో గల్లంతై లలిత్ సాగర్ మృతి చెందాడు.
లలిత్ సాగర్ నీటిలో కొట్టుకుపోవడం గమనించిన మత్స్యకారులు.. అతడి రక్షించేందుకు ప్రయత్నించినప్పటకీ ప్రయోజనం లేకపోయింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి గజ ఈతగాళ్లను నదిలో దింపి.. లలిత్ సాగర్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారం రోజుల వ్యవధిలోనే తండ్రికుమారులిద్దరూ మృతి చెందడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరీ ముఖ్యంగా ఏడాది కూడా నిండని చిన్నారిని చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. ఇప్పుడు మాకు దిక్కెవరూ అంటూ ఏడుస్తున్న వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.