భార్య మరణం తర్వాత మంగరాజు పిచ్చివాడు అయ్యాడు. ఆమె లేని లోకాన్ని ఊహించుకోలేకపోయాడు. చనిపోతే తాను కూడా భార్య దగ్గరకు వెళ్లిపోవచ్చని భావించాడు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
జీవితం చాలా చిన్నది. మనిషి 100 ఏళ్లు జీవించినా.. కోరుకున్నట్లుగా.. కోరుకున్న వారితో సంతోషంగా గడిపే క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. మనిషి పుట్టినప్పటినుంచి చచ్చేవరకు ఎంత సమయం సంతోషంగా ఉన్నామని ఆలోచిస్తే.. మన జీవితం ఎంత చిన్నదో అర్థం అవుతుంది. ప్రేమించిన వారితో క్వాలిటీ టైం గడపటమే నిజమైన జీవితం. వారితో గడిపిన అద్బుతమైన క్షణాలు.. అందమైన జ్ఞాపకాలుగా మారి మన జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. అయితే, ఈ జ్ఞాపకాలు ఒక్కోసారి ముల్లుగా మారే అవకాశం కూడా ఉంది.
ప్రేమించిన వారు దూరమైనపుడు జ్ఞాపకాలు వెంటాడి.. వేధించి ప్రాణాలు తీయొచ్చు కూడా. శ్రీకాకుళానికి చెందిన మంగరాజు అనే ఆర్మీ జవాన్ విషయంలోనూ ఇదే జరిగింది. భార్యతో నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్నాడు. కడదాకా తోడుంటుందని అనుకున్న భార్య అర్థాంతరంగా వదిలివెళ్లిపోయింది. అనారోగ్య సమస్యతో ఆమె చనిపోగా.. అతడు కలలు కన్న జీవితం ఒక్కసారిగా చీకటైంది. ఆ చీకట్లో బతకలేక అతడు కూడా భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం ఈసర్లపేట గ్రామానికి చెందిన మంగరాజుకు గత సంవత్సరం ఫిబ్రవరి 1న అదే ప్రాంతానికి చెందిన మౌనికతో వివాహం అయింది. మంగరాజు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతుండేవాడు. మనుషులు దూరంగా ఉన్నా వీరి మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉండేవి. ఫోన్ల ద్వారా వీలుచిక్కినప్పుడల్లా కమ్యూనికేట్ అవుతూ ఉండేవారు. అలా పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. క్యాంపు నుంచి ఇంటికి వచ్చినపుడు మంగరాజు భార్యతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. వీరి ప్రేమకు గుర్తుగా మౌనిక తల్లయింది. దంపతులతో పాటు రెండు కుటుంబాల వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
మౌనికకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. అందుకే భర్త డ్యూటీకి వెళ్లిపోయినపుడు పుట్టింటి దగ్గరే ఉండేది. వారం రోజుల క్రితం మౌనిక ఉన్నట్టుండి అనారోగ్యం పాలైంది. కుటుంబసభ్యులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రంగా ఉండటంతో అక్కడి వైద్యులు ఆమెను వైజాగ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. మౌనికను హుటాహుటిన అక్కడికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వాళ్లు మంగరాజు పని చేస్తున్న యూనిట్‌కు సమాచారం ఇచ్చారు.
‘మీ భార్య పరిస్థితి విషమంగా ఉంది. కచ్చితంగా రావాల్సిందే’ అని అన్నారు. మంగరాజు భార్య పరిస్థితి గురించి వినగానే షాక్ తగిలిన వాడిలా అయిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానంలో వైజాగ్ వచ్చేశాడు. నాలుగు రోజులు అన్ని ఆసుపత్రులు తిరిగారు. కానీ, ఎలాంటి ప్రతిఫలం లేకుండా పోయింది. ఆదివారం మధ్యాహ్నం ఆమె కన్నుమూసింది. భార్య చనిపోవటంతో మంగరాజు గుండె పగిలింది. అప్పటినుంచి ప్రతీక్షణం నరక వేధనను అనుభవిస్తూ వచ్చాడు. అతడి ఫ్రెండ్స్ అతడ్ని ఎంతో ఓదార్చారు. గంటలు, గంటలు అతడి దగ్గరే ఉండేవారు.
భార్య చనిపోయిన సమయం నుంచి మంగరాజు మాట్లాడటం తగ్గించేశాడు. అత్యవసరం అయితే తప్ప మాట్లాడేవాడు కాదు. ఆఖరికి కుటుంబసభ్యులతో కూడా ఎక్కువ మాట్లాడలేదు. భార్య పోయిన బాధలో ఉన్న అతడ్ని ఇబ్బంది పెట్టకూడదని కుటుంబసభ్యులు గమ్మునుండిపోయారు. చనిపోయి రోజు పొద్దున బ్యాంకుకు వెళ్లాడు. తన మిత్రులతో కలిసి బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రికి ఓ 27 వేల రూపాయలు ఇచ్చాడు. తర్వాత తన గదిలో పడుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వారు కూడా నిద్రపోయారు. వారు అలా నిద్రపోగానే..
మంగరాజు ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆరు గంటల వరకు ఫోన్ స్విచ్చాఫ్‌లోనే ఉంది. ఆరున్నరకు మంగరాజు అక్క అతడికి ఓ మెసేజ్ పెట్టింది. అప్పుడు అతడి వద్దనుంచి రిప్లై వచ్చింది. ‘‘ నా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సురెన్స్.. పీఎల్‌ఐ ఇన్సురెన్స్.. డ్యూటీ ఏజీఐ ఇన్సురెన్స్.. హెచ్‌డీఎఫ్‌సీ టర్మ్ ఇన్సురెన్స్ మా అత్తావాళ్లకు ఇచ్చేయండి. నీకు తెలుసుగా ఎట్టి పరిస్థితిలోనూ నార్మల్ డెత్ గానే చూపించండి డ్యూటీ వాళ్లకు. ఎవరికీ చెప్పకూడదు. నన్ను కాల్చొద్దు.. నా భార్యను పూడ్చిన పక్కనే పూడ్చండి. అప్పన్న కొడుకు హేమంత్ చెప్పులు వేసుకుని వచ్చేశా.. వాడికో 500 ఇచ్చేయ్ కొత్త చెప్పులు కొనుక్కుంటాడు. నాకు మందు అలవాటు లేదు.
నా మౌను కోసం ధైర్యం కోసం కొన్నా.. ఎలాగైనా దాని దగ్గరకు వెళ్లాలని’’ అని మెసేజ్ పెట్టాడు. ఆముదాల వలస నుంచి పొందూరు వెళ్లాడు. కొన్ని మెసేజ్‌లు టైపు చేసిపెట్టుకుని కొంతమందికి ఒకేసారి ఫార్వర్డ్ చేశాడు. అందరికీ ఆరున్నరకు వచ్చాయి. మంగరాజు తాను చనిపోతున్నానని చెప్పటంతో పాటు ఎక్కడ చనిపోతున్నాడో ఆ ప్రాంతం గురించి ఆ మెసేజ్‌లో వివరించాడు. తర్వాత ఫోన్‌ను ప్యాంట్స్ బ్యాక్ పాకెట్‌లో పెట్టి, ఉరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి ఏడున్నర ప్రాంతంలో స్నేహితులు అక్కడి వెళ్లారు. మంగరాజును మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అతడి చివరి కోరిక ప్రకారమే మౌనిక అంత్యక్రియలు జరిగిన ప్రాంతం పక్కనే పూడ్చిపెట్టారు.