‘రోడ్లన్నాక గుంతలు పడడం సహజం. గుంతలు ఉన్నప్పుడు చూసుకుని వెళ్ళాలి. నెమ్మదిగా వెళ్ళాలి. ఒక్కోసారి చూసుకోకుండా వేగంగా ప్రయాణిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోయే అవకాశం కూడా ఉంది’. ఇలాంటి మాటలు ఎవరైనా చెబుతారు. కానీ గుంత కనిపిస్తే పూడ్చే సాహసం ఎవరూ చేయరు. కానీ ఒకరున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ ఒక సీన్‌లో.. రోడ్డు మీద గుంత ఉంటే ఒక కర్ర తీసుకుని అప్పటికప్పుడు ఒక ఎర్రని గుడ్డ కట్టి ఆ కర్రని గుంతలో పాతి ఏ విధంగా అయితే ప్రమాదం జరగకుండా కాపాడాలని తాపత్రయపడతారో.. సరిగ్గా ఇలానే తాపత్రయపడే హీరో నిజ జీవితంలో కూడా ఉన్నారు. ఆయనే సన్ ఇన్ లా ఆఫ్ సుబ్బారావు. కొడుకు కాదు కానీ కొడుకుకేం తీసిపోరు. అల్లుడే అయినా కొడుకు లాంటి వారే. ఆయన పేరు వెంకటరావు. ఈయన మామగారు సుబ్బరావు.
విశాఖపట్నంలో ఉంటున్న రవ్వా సుబ్బారావు ఈ నెల 4వ తేదీన డీఆర్‌ఎం కార్యాలయం నుండి రైల్వేస్టేషన్‌కు బైక్‌పై వెళ్తుండగా.. రోడ్డుపై ఉన్న గుంతలో పడి మృతి చెందారు. ఆయన గుంత చూసుకోకపోవడం వల్ల వేగంగా వస్తున్న బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆయన తన ప్రాణాలను కోల్పోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమకి జరిగిన నష్టం ఇక ఏ ఇంట్లోనూ జరగకూడదని భావించారు. ఎవరు పట్టించుకోకపోయినా మేము పట్టించుకుంటామని ఫిక్స్ అయ్యారు. అంతే అనకున్నదే తడవుగా.. మృతుడి అల్లుడు వెంకటరావు తన బంధువుతో కలిసి మామ మృతికి కారణమైన గుంతను కాంక్రీటుతో పూడ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోను ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడిపోవటం కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడిపోవడం. ఈ జీవిత సత్యాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ ఎలా అయితే బాధ్యతగా వ్యవహరించారో.. అంతకంటే ఎక్కువ బాధ్యతతో సుబ్బారావు అల్లుడు వెంకటరావు వ్యవహరించారు. మరి వెంకటరావు సన్ ఇన్ లా ఆఫ్ సుబ్బారావు చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
“ఓదార్పు ఉచితమే, అందరూ చేస్తారు
సహాయం విలువైనది, కొందరే చేస్తారు”
మనిషిని కబలించిన గుంతల రోడ్డు.. స్పందించని అధికారులు..తమ కష్టం వెరెవ్వరికి రాకూడదని రోడ్డు పై ఉన్న గుంతని పూడ్చిన మృతుడి కుటుంబ సభ్యులు 🙏🙏 pic.twitter.com/TkOGV9Ojgt— PVP (@PrasadVPotluri) August 13, 2022