రానున్న ఎన్నికల్లో ‘టీడీపీ-జనసేన- బీజేపీ’ కలిసే పోటీ చేయనున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. జనసేనతోనే పొత్తు ఉంటుందని తెలిపిన ఆయన, చంద్రబాబుతో మాత్రం కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతం ఏపీలో ‘జనసేన-బీజేపీ’ మధ్య పొత్తు ఉండగా.. ‘జనసేన-టీడీపీ’ పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ-జనసేన అధ్యక్షులు కలవడం, మాట్లాడుకోవడం చూస్తుంటే.. రాబోవు ఎన్నికల్లో పొత్తు ఉంటుందనిపించక మానదు. కానీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాత్రం జనసేనతో ఓకే కానీ,.. టీడీపీతో మాత్రం కలిసేది లేదని చెబుతున్నారు.
అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడిన ఆయన..”ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయం కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకున్నందున పార్లమెంట్ సాక్షిగా 15 వేల కోట్లు ఇచ్చామని.. ఇంకొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. కాగా, ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన అన్యాయంగా జరిగిందన్నవిజయసాయిరెడ్డి, పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని.. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ కూడా మర్చిపోయిందని విమర్శించారు.