విద్యను అందించాల్సిన విద్యాలయాలు వివాదాస్పద స్థలాలుగా మారుతున్నాయి. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కే) వీసీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. విశ్వ విద్యాలయంలో హోమం చేయాలంటూ వీసీ తీసుకున్న నిర్ణయాన్ని రిజిస్ట్రార్ సర్క్యులర్ రూపంలో జారీ చేయడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి.
చదువులు చెప్పాల్సిన గురువులు మూఢ నమ్మకాలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. విద్యను అందించాల్సిన విద్యాలయాలు వివాదాస్పద స్థలాలుగా మారుతున్నాయి. అటువంటిదే ఈ సంఘటన. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కే) వీసీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. విశ్వ విద్యాలయంలో హోమం చేయాలంటూ వీసీ తీసుకున్న నిర్ణయాన్ని రిజిస్ట్రార్ లక్ష్మయ్య సర్క్యులర్ రూపంలో జారీ చేశారు. హోమం చేసేందుకు అయ్యే ఖర్చును చందాల రూపంలో స్టాఫ్ నుండి వసూలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. టీచింగ్ స్టాఫ్ 500 రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్ 100 రూపాయలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. వీటి వసూల కోసం ఏకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, బోధనేతర ఉద్యోగుల సంఘం కార్యదర్శిని నియమించడం విమర్శలకు తావినిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఎస్కే యూనివర్సిటీలో ఇటీవల వరుస మరణాలు సంభవించాయి. గత కొన్ని రోజుల్లోనే వివిధ కారణాలతో 25మంది యూనివర్శిటీ సిబ్బంది మరణించారు. ఈ సంఖ్యతో ఆందోళన చెందిన వీసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24న థన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం చేపట్టాలని భావించారు. ఇందులో భాగంగానే సిబ్బంది చందాలు ఇవ్వాలని సర్క్యూలర్ జారీ చేశారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చుని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. బోధనేతర సిబ్బందికి జీతాలు సరిగా ఇవ్వడం లేదని, అలాంటిది హోమాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ హోమాల పేరిట కుల, మతాలను విడదీసేందుకు, రెచ్చగొట్టేందుకు వీసీ ప్రయత్నిస్తున్నారని, ఈ నిర్నయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
యూనివర్శిటీ సిబ్బంది బాగోగులు గురించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే వర్శిటీ బయట చేయాలని, ఇక్కడ కాదంటూ మండిపడుతున్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడకుండా కులాలు, మతాల ప్రాతిపదిగిన హోమాలు చేయడం సరైన పద్ధతి కాదని అంటున్నారు. మేథావులను తయారు చేసే చోట ఇదేమీ చర్యలని మండిపడుతున్నారు. ఎస్కే యూనివర్సిటీ తలపెట్టిన మృత్యుంజయ హోమం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ఆ హోమాన్ని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపై రిజిస్ట్రార్ స్పందిస్తూ.. ఎవరి పేరు మీద అయితే హోమం చేయాలని భావిస్తే వారు చందాలు ఇస్తే సరిపోతుందని, బలవంతం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని హేతువాదులు, సామాజిక వేత్తలు సైతం తప్పుపడుతున్నారు. వీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.