సాధారణంగా ప్రజలకు మూఢనమ్మకాలు, భయాలు వంటి వాటిపై పోలీసులే అవగాహన కల్పించాలి. అలాంటివి ఉండవు ధైర్యంగా ఉండాలని చెప్పాలి. కానీ, అలాంటి పోలీసులకే ఓ భయం పట్టుకుంది. స్టేషన్ కు రావాలంటే ఏదో రకమైన భీతి. ఓ వైపు క్రైమ్ రేటు పెరిగిపోతుందనే ఆందోళన ఏం చేయాలో తెలియక పోలీసులు చివరికి శాంతి పూజలు చేయించారు. అలాగైనా వారి భయాందోళనలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులకు భయం పట్టుకుంది. ఓ వైపు క్రైమ్ రేటు పెరిగిపోతోంది. స్టేషన్ కి వెళ్లాలంటే అక్కడ ఎవరికీ మనసు రావడం లేదు. ఎందుకు అలా జరుగుతోంది అనే ఆలోచనతో వారికి టెన్షన్ ఎక్కువైపోయింది. ఏదైనా చేయాలని ఆలోచన చేశారు. ఇటీవల పాముకాటుతో స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ కూడా మరణించాడు. వారి మనసులు పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలు పెట్టాయి.
సాధారణంగా పోలీస్ స్టేషన్లలో కూడా దసరాకి ఆయుధ పూజలు చేస్తుంటారు. వారు వాటిని నమ్మినా నమ్మకపోయినా కూడా తప్పకుండా ఆయుధ పూజలు చేస్తుంటారు. అయితే పోయిన దసరాకి ఆళ్లగడ్డ స్టేషన్లో పూజలు చేయలేదు. అక్కడి నుంచి వారికి అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే భావనకు వచ్చారు. ఇంక, ఆలస్యం చేయకుండా పూజారిని పిలిపించి వెంటనే శాంతి పూజలు చేయించారు. క్రైమ్ రేటు కూడా తగ్గేలా చూడాలంటూ వేడుకున్నారు. ప్రస్తుతం ఈ పూజ వ్యవహారం స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.