ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందని రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారంటే సరే అనవొచ్చు.. కానీ ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ మూఢ నమ్మకాల వల్ల ఎంతో మంది మనుషులు బలి అవుతూనే ఉన్నారు. మంత్రాలు చేశారనే మూఢనమ్మకంతో కొంత మంది ఊళ్లకు ఊళ్లే ఖాళీచేస్తున్నారు.మూఢనమ్మకాలతోనే సహజీవనం చేస్తున్న పలువురు తమకు తామే లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఈ అరుదైన ఘటనలు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని రెండు గ్రామాల్లో అమలు అవుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామంలో కొంత మంది చేసిన నిర్వాకం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఊరిలో కొంత కాలంగా జనాలు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర జ్వరంతో ఇద్దరు చనిపోయారు. దీంతో తమ ఊరిని ఏదో దుష్టశక్తి ఆవహించిందని గ్రామస్థులు భయపడ్డారు. ఒకరిద్దరి నుంచి మొదలైన ఈ ప్రచారం ఊరంతా పాకింది. దీంతో ఊరి అరిష్టాన్ని పోగొట్టడానికి మాంత్రికులను తీసుకు రావాలని ఊరి పెద్దలు నిశ్చయించారు. ఇందుకోసం ఒడిశా, విజయనగరం ప్రాంతాలకు చెందిన మంత్రగాళ్లను సంప్రదించారు. గ్రామస్థుల భయం చూసి మాంత్రికులు పెద్ద పన్నాగం పన్నారు. ప్రస్తుతం ఊరిలో దుష్టశక్తి తిరుగుతుందని.. బలి కోరుతుందని భయపెట్టారు.
ఇక ఊరి ప్రజలు మాంత్రికుడు చెప్పినట్లు క్షుద్ర పూజలు చేస్తున్నారు. అంతేకాదు ఊరి నలుమూలలా దిష్టితీసిన నిమ్మకాయలు పెట్టి గ్రామంలోకి ఎవరూ రాకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీలకు తాళాలు వేసేశారు. ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకూ ఈ కట్టడి అమలు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఊరి పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేసినా వారు వినిపించుకునే పరిస్థితిలో లేరు. తమ ఊళ్లకు పట్టిన పీడ వదిలించుకునేందుకు ఇలా చేస్తున్నామని అంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.