ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాహనాదారుల నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే.. వాహనాలు సరిగా లేకపోవటం కారణంగా మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, ఎన్టీఆర్ జిల్లాలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది పిల్లలకు గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలానికి చెందిన కాకతీయ పబ్లిక్ స్కూలు బస్సు శుక్రవారం ఉదయం 10 మంది విద్యార్థులతో రోడ్డుపై వెళుతూ ఉంది. ఆ సమయంలో మంచు ఎక్కువగా ఉంది. రోడ్డు సరిగా కనిపించటంలేదు. ఈ నేపథ్యంలో బస్సు అదుపుతప్పింది.
అటు,ఇటు ఊగుతూ తొర్రగుంటపాడు వద్ద బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న 8 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు సహాయం కోసం బస్సు దగ్గరకు పరుగులు తీశారు. బస్సులోని 10 మంది విద్యార్థులను, డ్రైవర్‌ను బయటకు తీశారు. గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కాగా, గత కొద్ది రోజులుగా చలి ఎక్కువగా పెడుతోంది. కొన్ని గామాల్లో చలి మరీ విపరీతంగా ఉంటోంది. కొన్ని చోట్ల మంచు ఎక్కువగా కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే రోడ్డు కనిపించని పరిస్థితులు నెలకొంటున్నాయి. రోడ్డు కనిపించని కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.