ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 15 స్థానాలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. గురువారం విడుదలైన ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది.. మార్చి 13న పోలింగ్ జరగనుంది. వీటిలో ఏపీలో 13 స్థానాల్లో.. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీకి సంబంధించి 3 పట్ట భద్రులు, 2 ఉపాధ్యాయ స్థానాలు, 8 స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక, తెలంగాణకు సంబంధించి ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది.
వీటిలో పట్ట భద్రుల స్థానాలు.. 1) కడప, అనంతపురం, కర్నూలు 2) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు 3) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ స్థానాలు ఉన్నాయి. ఉపాధ్యాయ స్థానాల్లో.. 1) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు 2) కడప, అనంతపురం, కర్నూలు ఉన్నాయి. ఇక, అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరి, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.