ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అని అంటారు. కానీ నిజంగా సురక్షితమేనా. డ్రైవర్లు అంత బాగా నడుపుతారా? ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుతారా? ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయకుండా ఉంటారా? అంటే దానికి జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ డ్రైవర్ రాముళ్ళే నిదర్శనం. అవును తమ సర్వీసులో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయనటువంటి రియల్ హీరోలు.
ఒక్క ప్రమాదం లేకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యాన్ని చేర్చేవారిని హీరోస్ ఆఫ్ ఆన్ రోడ్ అంటారు. నిజమే డ్రైవర్లే మన హీరోలు. ప్రమాదాలు జరగకుండా క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తారు. ఒక్కోసారి బయట నుంచి వచ్చే ప్రమాదాలను పసిగట్టి వెంటనే అప్రమత్తమయ్యి బస్సులో ఉన్న ప్రయాణికులను రక్షిస్తారు. అంతెందుకు ఇటీవల కాలంలో గుండెపోటు వచ్చినా సరే బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏమీ కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్లు ఉన్నారు. పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆ మహిళను బస్సులో ఆసుపత్రికి చేర్చిన డ్రైవర్లు ఉన్నారు. ఇలా కొంతమంది డ్రైవర్లు డ్యూటీని దైవంగా భావించి పని చేస్తుంటారు. తన బస్సులో ఉన్న ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా జీవిస్తుంటారు. అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇస్తుంటుంది.
ఏపీఎస్ ఆర్టీసీలో ఇద్దరు డ్రైవర్లకు జాతీయ అవార్డులు వరించాయి. హీరోస్ ఆఫ్ ఆన్ రోడ్ పేరిట రాజు అనే డ్రైవర్ కు, ఏఎం బాషా అనే డ్రైవర్ కు జాతీయ అవార్డులు దక్కాయి. వీరి సర్వీసులో ఒక్క ప్రమాదం కూడా చేయలేదు. అందుకే హీరోస్ ఆఫ్ ఆన్ రోడ్ పేరిట జాతీయ అవార్డు బహుకరించారు. అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) దేహవ్యాప్తంగా అని రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన 42 మంది డ్రైవర్లను ఎంపిక చేయగా.. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు డ్రైవర్లు ఉన్నాయి. ఒకరు సింహాచలం డిపోకి చెందిన రాజు కాగా.. మరొకరు ఆత్మకూరు డిపోకి చెందిన ఏఎం బాషా. ఢిల్లీలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో డ్రైవర్లకు ట్రోఫీ, ప్రశంసా పత్రం, 10 వేల రూపాయల నగదు అందజేశారు.
తాము ఆర్టీసీలో 35-36 ఏళ్లుగా పని చేస్తున్నామని.. జాతీయ స్థాయిలో అవార్డులు దక్కడం గర్వంగా, సంతోషంగా ఉందని రాజు, బాషా అన్నారు. ఇక తెలంగాణ నుంచి కూడా ఇద్దరు డ్రైవర్లకు జాతీయ అవార్డులు వరించాయి. కుషాయిగూడ డిపోకి చెందిన కె. రంగారెడ్డి, సూర్యాపేట డిపోకి చెందిన కె. సోమిరెడ్డి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. వీరు కూడా తమ సర్వీసులో ఒక్క ప్రమాదం కూడా చేయలేదు. అందుకే వీరికి హీరోస్ ఆఫ్ ఆన్ రోడ్ పేరిట జాతీయ అవార్డులు వరించాయి. మరి ఆర్టీసీ డ్రైవర్లకు జాతీయ అవార్డులు రావడం పట్ల మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే డ్రైవరన్నలకు అభినందనలు తెలియజేయండి.