ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ రియల్ హీరోగా నిలిచాడు. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రయాణికులను కాపాడాడు. దీంతో ఆయన్ను అందరూ మెచ్చుకుంటున్నారు.
ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంతో సురక్షితమైనదని అంటుంటారు. దీంట్లో క్రమశిక్షణతో డ్రైవింగ్ చేసే డ్రైవర్ల పాత్ర ఎంతో ఉంది. సేఫ్ డ్రైవింగ్‌తో ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తుంటారు డ్రైవరన్నలు. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆర్టీసీ బస్సు నడుపుతున్న గోపాల్ అనే డ్రైవర్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పి రావడంతో తల్లడిల్లిపోయాడు. పంటి బిగువున నొప్పిని భరించి బస్సును సేఫ్‌గా పక్కకు ఆపి.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. కర్నూలు నుంచి అనంతపురం జిల్లాలోని రాయదుర్గానికి వెళ్తుండగా.. కళ్యాణ దుర్గం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
కళ్యాణ దుర్గం దగ్గరకు రాగానే బస్సు నడుపుతున్న గోపాల్‌కు ఛాతీలో నొప్పి మొదలైంది. దీంతో బస్సును అదుపు చేసి, స్టీరింగ్ మీద పడిపోయాడు. ఈ ఘటన జరిగిన టైమ్‌లో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కండక్టర్, ప్రయాణికుల సాయంతో డ్రైవర్ గోపాల్‌ను కళ్యాణ దుర్గంలోని సర్కారు దవాఖానాకు తరలించారు. బీపీ ఎక్కువవడంతోనే డ్రైవర్ స్పృహ కోల్పోయాడని వైద్యులు తెలిపారు. గోపాల్‌కు డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి పంపారు. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రయాణికులను రక్షించిన డ్రైవర్ గోపాల్‌ను పలువురు అభినందించారు.