ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓ ఆటోలో తరలిస్తున్న రూ.500 నోట్లు కొన్ని గాలిలో ఎగిరిపడటం కలకలం రేపింది.
సాధారణంగా ఎవరైన ప్రయాణ సమయంలో డబ్బులు, విలువైన వస్తువులు పడిపోతే.. వాహనం నిలిపి వాటిని తీసుకుంటారు. అంతేకాక తమ వద్ద ఉండే నోట్ల కట్టలు గాలికి ఎగిరిపోతుంటే భయందోళనకు గురవుతారు. కానీ తాజాగా ఓ ఆటోలో నుంచి రూ.500 నోట్లు కట్టలు నడిరోడ్డు మీద పడిపోయాయి. ఆటోలో ఉన్న వాళ్లు మాత్రం ఆ డబ్బులు తమవి కాదన్నట్లు ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో టోల్‌గేట్ సిబ్బంది వాటిని సేకరించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని మడపాం టోల్ గేట్ వద్ద చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శుక్రవారం శ్రీకాకుళం వైపు నుంచి నరసన్న పేట వైపు వెళ్తున్న ఓ ఆటో నుంచి రూ.500 నోట్లు ఎగిరి పడ్డాయి. నరసన్నపేట మండలం మడపాం టోల్ గేట్ దాటిన తరువాత ఆ ఆటో నుంచి నోట్లు నడిరోడ్డుపై పడ్డాయి. చాలా నోట్లు గాలిలో చాలా సమయం పాటు చక్కర్లు కొట్టాయి. డబ్బులు కిందపడిపోయిన విషయాన్ని ఆటోలో ఉన్నవాళ్లు గుర్తించారు. అయినా తమవి కాదన్నట్లు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో టోల్ గేట్ లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది ఆటోను పట్టుకునే ప్రయత్నం చేశారు.
మరికొందరు రోడ్డుపై పడిన నోట్లను సేకరించి.. పోలీసులకు అప్పగించారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇలా రోడ్డుపై నోట్లు కిందపడటం కలకలం రేపింది. ఈ ఘటనపై టోల్ గేట్ సూపర్ వైజర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు టోల్ గేట్ సీసీ పూటేజీని పరిశీలించారు. పసుపురంగు ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అలానే ఆటో ముందు ఓ బైక్ వెళ్తున్నట్టు గుర్తించామన్నారు.
కరజాడ వద్ద నుంచే వీరు నోట్లు విసురుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. టోల్‌గేట్ వద్దకు వచ్చే సరికి నోట్ల వర్షం పెరిగింది. ఈ నోట్లు ఎవరివి, ఆటో ఎవరిది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలో ఆటో నంబరును గుర్తించారు. టోల్‌గేటు వద్ద రూ.88 వేలు లభించాయి. సోమవారం తహసీల్దార్ కోర్టుకు పంపుతామని, ఎవరైనా నగదు తమదేనంటూ ఆధారలతో వస్తే అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.