మంత్రి రోజా సెల్వమణి.. ఒక నటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా, రాజకీయ నాయకు రాలిగా మారారు. ప్రజలకు చేసిన సేవకు గుర్తింపుగా ఇటీవలే మంత్రి కూడా అయ్యారు. పిల్లలను కూడా రోజా అలాగే పెంచారంటూ ఇండస్ట్రీలో చెబుతుంటారు. రోజా కుమార్తె అన్షు మాలిక గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె అందరి సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా భిన్నంగా ఉంటుంది.
అన్షు మాలిక ఈ వయసులోనే ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తోంది. ఇంక పేద పిల్లలకు భోజనం పెట్టడం, ట్యూషన్స్ చెప్పడం, బట్టలు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి విషయాలు చాలా మందికి తెలుసు. కానీ, ఆమె ఒక గొప్ప రచయిత అని చాలా తక్కువ మందికి తెలుసు. తాజాగా అన్షు మాలిక రాసిన “ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్” అనే పుస్తకం రాయడమే కాకుండా.. ఆ పుస్తకంతో అరుదైన గౌరవం అందుకుంది.
‘జి- టౌన్ మ్యాగజైన్’ సౌత్ ఇండియా నుంచి ‘బెస్ట్ ఆథర్’ కేటగిరీలో మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికను ఎంపిక చేశారు. కోల్ కతాలో జరిగిన బహుమతి ప్రదానం కార్యక్రమంలో ఈ అవార్డును బాలీవుడ్ నటి షాజాన్ పదామ్సీ చేతుల మీదుగా అందుకుంది. రచయిత్రిగా ఈ స్థాయికి ఎదగడానికి అందరి ఆశీస్సులు కారమంటూ అన్షు మాలిక ఆనందం వ్యక్తం చేసింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తె గురించి మాట్లాడుతూ రోజా ఎమోషనల్ అయ్యారు. ఎవరూ చెప్పకుండా తనంతట తానే సమాజానికి పనికొచ్చే పనులు చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. ఒక రచయితగా కూడా అన్షు మాలిక సాధిస్తున్న విజయాలు తననెంతో గర్వపడేలా చేస్తున్నాయంటూ రోజా పేర్కొన్నారు. ఇంక అన్షుకి ఈ అవార్డు రావడంపై పలువురు అభినందనలు తెలియజేశారు. రోజా కుమార్తెకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.