శివరాత్రి పండుగ రోజున శివుడ్ని దర్శించుకోవాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సకుటుంబ సపరివారమంతా ట్రాక్టర్ ఎక్కి మల్లన్న గుడికి వెళదామని బయలు దేరారు. అంతలోనే ఊహించని ప్రమాదం..
ప్రమాదాలు ఎటు నుండి, ఎలా, ఏ రూపంలో వస్తాయో ఊహించలేమనడానికి ఈ ఘటన ఉదాహరణ. శివరాత్రి పండుగ రోజున హరి హరుడ్ని దర్శించుకోవాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సకుటుంబ సపరివారమంతా ట్రాక్టర్ ఎక్కి మల్లన్న గుడికి బయలు దేరారు. ప్రయాణంలో ముచ్చట్లలో మునిగి తేలారు. కానీ ఊహించని ప్రమాదం ఆ వాహనం రూపంలో వస్తుందని అనుకోలేదు. వారు కూర్చున్న ట్రాక్టరే యమపాశమై ఇద్దరి ప్రాణాలను బలిగొంటుందని అస్సలు ఊహించి ఉండరు. ట్రాక్టర్ తలుపు ఇద్దరి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఈ ఘటన పల్నాడు జిల్లా రెంటచింతలలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుమృకోటకు చెందిన సుమారు 25 మంది శనివారం శివరాత్రి కావడంతో సత్రశాల మల్లయ్య స్వామి దర్శనానికి బయలు దేరారు. వీరంతా ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నారు. పశర్ల పాడు సమీపానికి ట్రక్కు రాగానే.. దానికున్న తలుపు ఊడింది. ట్రాక్టర్ లోని షేక్ కారంపూడి నన్నే షాహెబ్, షేక్ కారంపూడి లాల్ సాహెబ్ తారు రోడ్డుపై పడ్డారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని 108 ద్వారా గురజాల ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లే లోగా లాల్ సాహెబ్, పిడుగురాళ్ల సమీపానికి చేరుకోగానే నన్నే సాహెబ్ మరణించారు. పండగ వేళ ఇద్దరు మరణించడంతో ఆయా కుటుంబాల్లో విషాదాలు నెలకొన్నాయి. వీరితో వచ్చిన వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు.