రోడ్లు రక్తమోడుతున్నాయి. ఘోర రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఆరుగురు మృతి చెందారు. వీరంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. వీరంతా కలిసి ఆటోలో వెళుతుండగా..
కూలీ పనులకు వెళ్లేవాళ్లు.. ఎక్కడ పని ఉంటే అక్కడకు వెళ్లాల్సిందే. అందుకే పొద్దునే లేచి.. కొంత అన్నం, కూర వండుకుని దూరాబారాలకు ప్రయాణం చేసి వెళుతుంటారు. పిల్ల, పాపల్ని ఇంటి దగ్గర వదిలేసి.. భార్య, భర్తలిద్దరూ కూలీ పనులకు పోతుంటారు. అలా పనులకు ఆటోలో బయలు దేరిన కూలీలు బతుకులు.. తెల్లవారు జామున తెల్లారిపోయాయి. తెలంగాణ నుండి ఆంధ్రకు బయలు దేరిన కూలీలను.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని నల్గొండ జిల్లా నుండి ఏపీలోని పల్నాడు జిల్లాలో పనులకు బయలు దేరిన కూలీల ఆటోను.. లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి పైగా గాయాలయ్యాయి. మృతులు దామరచర్ల మండలం నరసాపురం గ్రామం నుండి పల్నాడు జిల్లాలోని గురజాల మండలం పులిపాడుకు ఆటోలో బయలు దేరారు. మొత్తం 10 మందికి పైగా ఆటోలో బయలు దేరినట్లు తెలుస్తోంది. దాచేపల్లి మండలం పొందుగల వద్దకు ఆటో రాగానే.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
మృతుల్లో అధికులు 40 ఏళ్లలోపు వారే. క్షతగాత్రులను 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గ్రామ వాసులు ఇస్లావత్ ముజుల (25), భూక్య పద్మ (27), పానియా సక్ర (35), భూక్య నాని (55), మాలావత్ కలిత (30), బానవత్ పార్వతి(30)గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.