రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ప్రాణాపాయం నుండి తప్పించుకుంటున్నా.. వారిని ఆ గాయాలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. తాజాగా ఏపీలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఓ చోట రోజుకో రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంటోంది. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ప్రాణాపాయం నుండి తప్పించుకుంటున్నా.. వారిని ఆ గాయాలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ ప్యారడైజ్ వద్ద చెన్నయ్‌కు చెందిన వ్యక్తి మరణించిన సంగతి విదితమే. వేముల వాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగం, నిర్లక్ష్య ధోరణి, మద్యం సేవించి డ్రైవింగ్, పని ఒత్తిడి, నిద్ర మత్తులో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీలో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
కృష్ణా జిల్లా చిట్టి గూడురులో రెండు బస్సులు బలంగా ఢీ కొన్నాయి. ఆర్టీసీ బస్సు, మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో అదుపు తప్పిన ప్రైవేట్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆర్టీసీ బస్సు ధ్వంసమైంది. మచిలీపట్నం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మహానంది వద్ద బైక్‌ను బోలోరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. రోడ్డుపై నడిచేటప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశక్యత ఎంతైనా ఉందని ఈ ప్రమాదాలు సూచిస్తున్నాయి.