ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. ప్రతిరోజూ పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు మద్యతరగతి కుటుంబీకులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఇంధన ధరలు పెరిగితే ప్రయాణ ఖర్చులు కూడా భారీగానే పెరిగిపోతాయి.. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కూరగాయలపై పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ మద్య ఏపిలో భారీ వర్షాలు పడిన కారణంగా కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్నాయి. మొన్నటికి మొన్న కిలో టమాట రూ.200 ధర పలికింది. ఇప్పుడు ఇతర కూరగాయలు కూడా అదే దారి పడుతున్నాయి.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మునగకాయలు కిలో ధర 600 రూపాయలు పెరిగింది. మునగకాయల సైజును బట్టి కిలోకు 12 నుంచి 18 తూగుతాయి. ఈ లెక్కన ఒక్కో మునగకాయ రూ. 30కి పైనే పలికినట్టు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా మునగ పంట దెబ్బతినడం వల్లే ధర పెరిగినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో తమిళనాడు రాష్ట్రం నుంచి మునగకాయలు దిగుమతి అవుతున్నాయి.
ఒక్క మునగకాలు మాత్రమే కాదు వంగ, బీర, కాకర, బీన్స్, ముల్లంగి తదితర కూరగాయలు మార్కెట్లో కిలో 80 రూపాయల నుంచి 180 రూపాయలు పలుకుతున్నాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న కూరగాయల రేట్లు చూసి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ధరలు పెరుగుతూ పోతే తమ రోజువారి జీవితం ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.