ప్రస్తుత కాలంలో అప్పు చేసైనా సరే.. ఆడపిల్లను మాత్రం ఉద్యోగస్తుడికే ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మీర చదవబోయే తండ్రి మాత్రం బీటెక్ చదివిన బిడ్డను పాప్‌కార్న్ అమ్ముకుని పొట్ట పోసుకునే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ వివరాలు..
సాధారణంగా పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. అలానే మన ఇంటి బిడ్డను ఆర్థికంగా మనకంటే మంచి స్థితిలో ఉన్న వాళ్లకు ఇవ్వాలి.. కోడలిని మన కంటే తక్కువ ఆర్థిక స్థాయి ఉన్న వాళ్ల ఇంటి నుంచి తెచ్చుకోవాలి అంటారు. ఏది ఎలా ఉన్నా ఆడపిల్ల సంతోషమే ముఖ్యం. ఒకప్పుడు అంటే బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. ఉద్యోగస్తుల సంబంధాల కన్నా.. ఊరిలో ఉండి వ్యవసాయం చేసుకుని.. కాయకష్టం చేసుకునే వారికి పిల్లను ఇవ్వడానికి మొగ్గు చూపేవారు. అయితే నేడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్నదో, పెద్దదో ఉద్యోగం.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగం అయి ఉంటే ఇంకా చాలా బెటర్ అనుకుంటున్నారు అమ్మయిలు. వ్యవసాయం, వ్యాపారం చేసుకునేవాళ్లకు అమ్మాయిని ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు.
పైగా అమ్మాయి బీటెక్ చదివితే సాఫ్ట్‌వేర్ సంబంధాలు, డాక్టర్ చేస్తే.. వైద్య వృత్తిలో ఉన్న సంబంధాలే చూస్తున్నారు. అప్పు చేసైనా సరే బిడ్డకు మంచి సంబంధం చూడాలని ఆశపడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే తండ్రి మాత్రం ఇందుకు భిన్నం. బీటెక్ చదివిన బిడ్డను.. రోడ్డు మీద పాప్‌కార్న్ అమ్ముకునే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. మరి కారణమేంటి.. ఎందుకు ఇలా చేశాడు అంటే..
ఈ సంఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన చెందిన సుధీర్.. నిజాంపేట నుంచి దానవాయి పేట గాంధీ పార్కుకి వెళ్లే రోడ్డు పక్కన పాప్ కార్న్ బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పాప్‌కార్న్ మాత్రమే కాక రకరకాల హాట్ స్నాక్స్‌ను అమ్ముతుంటాడు. రోడ్డు పక్కనే ఉండటం.. పదార్థాలు రుచిగా ఉండటం మాత్రమే కాక పని పట్ల అతడు చూపే అంకితం భావం నచ్చి.. చాలా మంది కస్టమర్లు.. సుధీర్ దగ్గర స్నాక్స్, పాప్ కార్న్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దాంతో సుధీర్ బండి పెట్టుకున్న ప్రాంతం ఎప్పుడూ కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే సుధీర్‌కు వివాహం అయ్యింది. అది కూడా బీటెక్ చదివిన యువతితో.
బీటెక్ చదివి.. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న మాకే అమ్మాయిలు దొరకడం లేదు.. మరి పాప్‌కార్న్ అమ్మే వ్యక్తికి బీటెక్ అమ్మాయితో పెళ్లి అంటే గ్రేటే. మరి ఇక్కడ తిరకాసు ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నారా.. అలాంటిది ఏం లేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు సంతోషంగానే ఈ వివాహానికి అంగీకరించారు. ఘనంగా పెళ్లి చేశారు. ఎందుకు అంటే.. వాస్తవానికి సుధీర్ కూడా బీటెక్ ట్రిపుల్ ఈ చదివాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా.. 10 లక్షలు కడితే సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరో చెబితే అమాయకంగా నమ్మాడు. బయట అప్పుతెచ్చి మరి ఆ మొత్తం చెల్లించాడు.
డబ్బులు తీసుకున్న వ్యక్తి ఉద్యోగం ఇప్పించలేదు. రోజులు గడుస్తున్నాయి కానీ ఉద్యోగం రాలేదు. దాంతో తాను మోసపోయానని సుధీర్‌కు అర్థమైంది. పది లక్షల రూపాయలు అంటే మాటలా. సుధీర్ స్థానంలో వేరే ఎవరు ఉన్నా.. అప్పుల భారం, మోసపోయామనే బాధతో తీవ్ర నిర్ణయాలు తీసుకునేవారు. కానీ సుధీర్ మాత్రం మోసపోయినందుకు బాధ పడ్డాడు తప్పితే.. అధైర్య పడలేదు. ఎలాగైనా అప్పులు తీర్చాలని అనుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. పాప్‌కార్న్ బండి ఐడియా వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. గత 7-8 ఏళ్లుగా పాప్ కార్న్ బండి నడుపుతోన్న సుధీర్.. బయట తెచ్చిన అప్పుల్లో ఇప్పటి వరకూ సగం తీర్చేశాడు.
ప్రసుత్తం వ్యాపారం సాగుతోంది.. అప్పులు తీరుతున్నాయి.. కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు.. వీటితో పాటు వయసు కూడా పెరుగుతోంది. మరీ పెళ్లి మాటేంటి అని సుధీర్ కుటుంబ సభ్యులు ఆలోచించసాగారు. ఉద్యోగాల చేసే వారికే అమ్మాయిలు దొరకడం కష్టం అవుతోంది. అలాంటది బీటెక్ చదివి రోడ్డు పక్కన పాప్ కార్న్ అమ్ముకునే వ్యక్తికి ఎవరైనా పిల్లనిస్తారా.. అని ఆందోళన పడసాగారు. కానీ ఈ విషయంలో సుధీర్ అదృష్టవంతుడు. బీటెక్ చదివిన అమ్మాయి అతడిని వివాహం చేసుకుంది. ఆమెది చాలా మంచి మనసు అనుకుంటున్నారా.. అవును నిజమే.. కానీ ఆమె తండ్రి.. ఆమెకన్నా మంచి వాడు. ఎందుకంటే ఆయనే తన కూతుర్ని ఈ పెళ్లికి ఒప్పించాడు.
‘ఉద్యోగం చేసుకునే వ్యక్తి కన్నా రోజంతా కష్టపడి పని చేసుకునేవాడు నిన్ను కళ్లలో పెట్టుకొని చూసుకుంటాడు తల్లీ.. అతడితో నీ జీవితం బాగుంటుందమ్మా’ అని బిడ్డకు చెప్పాడు. తండ్రి మాటాల్లో సుధీర్ మీద ఆయనకు ఉన్న నమ్మకం ఆమెకు కనిపించింది. అప్పుల భారంతో అఘాయిత్యాలకు పాల్పడకుండా.. ధైర్యంగా నిలబడి.. పోరాడి గెలిచిన సుధీర్ ఆత్మ విశాస్వం ఆమెకు బాగా నచ్చింది. దాంతో అతడితో కలిసి ఏడడుగులు వేయడానికి అంగీకరించింది. సుధీర్ మామ గారు కూడా డిగ్రీ చదివారట. చదువు అయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దాంతో ఆశ వదిలేసుకుని.. ఆటో నడపటం మొదలుపెట్టారు.
అందరిలాగే సాఫ్ట్ వేర్ జాబ్ చేద్దామని కలలుగన్న సుధీర్.. చివరకు పాప్ కార్న్ బండి నడుపుతూ తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. తాను చేసే పని గురించి అతడు ఎప్పుడు అవమానకరంగా భావించడు. ఏదైనా కష్టమే కదా.. ఒళ్లు వంచి, కష్టపడి పని చేసుకుంటున్నాను.. నేను ఎందుకు నామోషీగా ఫీలవ్వాలని ప్రశ్నిస్తాడు. ఇక సుధీర్ తన తమ్ముడికి కూడా రాజమండ్రిలోనే మరో ప్రాంతంలో పాప్ కార్న్ బండి పెట్టించాడు. అందరూ కలిసి ఉన్నదాంట్లోనే సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నారు. తన అప్పులు తీరాక వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు సుధీర్.
చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం, నచ్చిన జాబ్ దొరికితేనే చేస్తామంటూ ఏళ్లకు ఏళ్లు వృథా చేసే వాళ్లు మన మధ్యలోనే ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి సుధీర్ జీవితం ఆదర్శం. చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోయినా.. అప్పుల పాలయినా సరే.. అతడు బెదరిపోలేదు. కష్టాలకు ఎదురు నిలిచాడు. అన్నింటికన్నా ముఖ్యం అతడిని అర్థం చేసుకునే అమ్మాయి జీవిత భాగస్వామిగా లభించింది. ఇంకేం కావాలి అంటున్నాడు సుధీర్. మరి సుధీర్ జీవితం చూస్తే మీకేమనిపిస్తోంది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.