ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిలాలకు మళ్ళీ వాన గండం పొంచివుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల ఏపీలో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతఇంతకాదు. దాని నుంచి ఇంకా తేరుకోక ముందే ఏపీకి మరో తుఫాన్ గండం వచ్చింది. “బుధవారం మధ్య అండమాన్ సముద్రం.. దాని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించింది.
ఇది ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మధ్య ప్రాంతంలో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది తరువాత వాయువ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతం తీరం వెైపు ప్రయాణించి ఉత్తరాంధ్ర , దక్షిణ ఒడిస్సా తీరాన్నీ ఈనెల 4వ తేదీని తాకవచ్చు” అని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ తుఫాన్ కు జావద్ అని నామకరణం చేశారు. ఈ జావద్ తుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తోంది.ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రకు ‘జావద్’ తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం ఈ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాలను గుర్తించి, అక్కడి వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం తెలిపారు. ఉత్తరాంధ్రలో భారీ వర్ష సూచన నేపథ్యంలోఅక్కడ తుపాన్ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు నియమించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాన్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు.