'నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు' అన్నట్లుగా నగరంలో కొన్ని పేరొందిన స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి ప్రైమరీ చదువులకే బీటెక్ తరహాలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో నిరుపేద తల్లిదండ్రులు కార్పొరేట్ చదువులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
‘చదువు పేరుతో దందా..‘ ఈ కాన్సెప్ట్ తో సినిమాలు వస్తున్నా ప్రభుత్వాల్లో చలనం రావట్లేదు. ఒకవేళ చలనం వచ్చినా అప్పటికప్పుడు కమిటీలంటూ హడావుడి చేయడం తప్ప.. ఆ కమిటీల నివేదికలేంటో.. వారి తీసుకున్న చర్యలేంటో సాధారణ ప్రజలకు తెలియవు. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రైవేటు స్కూల్స్ యజమాన్యాలు పెట్రేగిపోతున్నాయి. అధిక ఫీజుల పేరుతో మధ్యతరగతి, నిరుపేదలను పిండి.. పీల్చి పిప్పి చేస్తున్నాయి. వీటి నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా ఫలితం మాత్రం శూన్యం. పిల్లల చదువులు, వారి ఫీజుల పేరు ఎత్తితే.. సగటు నిరుపేద విద్యార్థి తల్లిదండ్రుల గుండె గుబేల్ మంటోంది.
నగరంలోని కొన్ని కార్పొరేట్ స్కూళ్లల్లో ఎల్‌కేజీకి లక్షపైనే వసూలు చేస్తున్నారని సమాచారం. ఇక ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు తరగతులకైతే రూ. లక్షా 20 వేల నుంచి లక్షా 70వేలకు వసూలు చేస్తున్నారని వినికిడి. ఈ విషయం కార్పొరేట్ స్కూళ్లలో పిల్లలను చదివిస్తోన్న ప్రతి తల్లిదండ్రికి తెలుసు. కానీ నిజాలు చెప్పడానికి ఎవరూ బయటకి రారు. ఈ తీరే కార్పొరేట్ యాజమాన్యాలకు లొసుగుగా మారుతోంది. ఇష్టారీతిని ఫీజులు పెంచేస్తున్నారు. మంత్రి వర్గ ఉపసంఘం సిఫారసు ప్రకారం.. తెలంగాణలోని పాఠశాలలు మునుపటి సంవత్సరంలో వసూలు చేసిన ఫీజులో 10 శాతానికి మించి ఫీజులు పెంచకూడదు. కానీ ఈ నిబంధనలను కార్పొరేట్ యాజమాన్యాలు పక్కన పెట్టేస్తున్నాయి.
ఈ విద్యా సంవత్సరం స్కూల్ ఫీజులు 20 నుంచి 50 శాతం పెరిగినట్లు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. వచ్చే ఏడాది కట్టాల్సిన ఫీజుల గురించి ఇప్పటికే ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ మెసెజ్‌లు, నోటీసులు, మెయిల్స్ పంపారని సమాచారం. ఈ స్కూల్ ఫీజులకు అదనంగా కంప్యూటర్ క్లాస్ ఫీజులంటూ మరింత కట్టమన్నట్లు వినికిడి. ఏదో నాలుగైదు కంప్యూటర్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప.. చెప్పేదేమీ ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విషయంలో సరైన నియంత్రణ లేకపోవడమే అధిక ఫీజులకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు.. ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి.. యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి కమిటీని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమా..? కాదా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.