ప్రభుత్వ బడుల్లో సదుపాయలు, వసతుల లేమి కారణంగా .. ప్రైవేటు బడులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. బడులు పెట్టడం ఆలస్యం.. ప్రకటనలు చేసుకుని.. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజు అని, ఆ ఫీజు.. ఈ ఫీజు అని చెబుతూ వేలల్లో గుంజేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఏడాదంతా స్కూల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఓ విద్యార్థి స్కూల్ ఫీజు కట్టలేదని ప్రిన్సిపాల్ ఏం చేశారంటే..?
ఈ రోజుల్లో చదువు కూడా యాపారం అయిపోయింది. ప్రభుత్వ బడుల్లో సదుపాయలు, వసతుల లేమి..ప్రైవేటు బడులకు వరంగా మారింది. అవి పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. బడులు పెట్టడం ఆలస్యం.. ప్రకటనలు చేసుకుని.. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజు, ఆ ఫీజు.. ఈ ఫీజు అని చెబుతూ వేలల్లో గుంజేస్తున్నారు. స్కూల్ యూనిఫాం నుండి పుస్తకాలు కూడా వీరి వద్దే కొనాలి. ఇది చాలదన్నట్లు స్కూల్, వ్యాన్ ఫీజు పేరిట ఏడాదంతా వసూలు చేస్తుండటంతో.. తల్లిదండ్రులు జేబులకు చిల్లులు పడుతున్న పరిస్థితి. ఇక ఫీజు ఆలస్యమైందా.. పిల్లలను బడిలోకి రానివ్వరు, లేదంటే పరీక్షలు రానియ్యరు స్కూల్ యాజమాన్యం. తల్లిదండ్రులు ఫోన్లు చేసి డబ్బులు కట్టాలంటూ వేధిస్తారు. వారు ఎంత చెప్పినా వినిపించుకోరు. ఫీజు కడతామని.. కొంచెం టైమ్ ఇవ్వాలని అడిగిన తల్లిదండ్రులతో చీపురుతో దాడికి దిగాడో ప్రిన్సిపాల్.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన విఎన్‌జీ ఇంగ్లీషు మీడియం స్కూల్ తీరే వేరు. ఫీజులు కట్టలేదని ఓ విద్యార్థి, అతడి తల్లిదండ్రులపై ఏకంగా చీపురు తీసుకుని దాడి చేశాడు ఆ స్కూల్ ప్రిన్సిపాల్. వివరాల్లోకి వెళితే.. రూ. 11 వేల ఫీజు కట్టాలని, సెలవులు దగ్గర పడుతున్నాయని..ఎప్పుడు కడతారని ఓ బాలుడి తల్లిదండ్రులను పీడించారట ఈ స్కూల్ యాజమాన్యం. ఈ విషయంపై మాట్టాడేందుకు వచ్చిన తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం నెలకొంది. చివరకు ఆ గొడవ చిలికి గాలి వానగా మారింది. దీంతో బాలుడి తండ్రిపై చీపురుతో దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు ప్రిన్సిపాల్.
అయితే అక్కడే ఉన్న కొంత మంది మహిళలు అతడిని ఆపే ప్రయత్నం చేశారు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారి మధ్య జరిగిన గొడవ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఇదే విషయాన్ని మీడియా అడిగితే.. ప్రిన్సిపాల్ చెప్పిన తీరు చూసి ఖంగుతిన్నారు. ‘నేనా వారి మీద దాడి చేశానా’ అంటూ యాక్టింగ్ ఇరగదీశాడు. ఈ పంచాయతీ పోలీసుల వద్దకు కూడా చేరింది. అయితే వీరిద్దరూ వచ్చి రాజీ కుదిర్చారట. బడిలో పంతులు అంటే చాలా కూల్ గా ఉండాలి కానీ.. ఈ ప్రిన్సిపాల్ తీరు ఏంటనీ ఆశ్చర్యపోతున్నారట అక్కడి జనం.