రాష్ట్రంలోని రెండు థర్మల్ పవర్ ప్లాంట్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో లోడ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫాల వారీగా విద్యుత్తు సరఫరాకు కోత పెట్టారు. ప్రతి గ్రామానికి కనీసం 1-2 గంటల పాటు రొటేసన్ పద్దతిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పాటు పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకూ కోతలు విధించారు. దీని గురించి జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ గగ్గోలు పెడుతున్నారు. ఒక ప్రాంతంలో కరెంట్ వస్తుంటే, మరో ప్రాంతంలో కరెంటు పోతుంది. ఇక చాలా చోట్ల ఈ రోజు కేబుల్ ప్రసారాలు కూడా ఆపివేశారని వార్తలు ప్రచారం అవుతున్నాయి.
దీని వెనక గల సాంకేతిక సమస్య ఏంటి అని ఆరా తీస్తే, చలి కాలం కరెంటు వినియోగం ఎలాగూ తక్కువే ఉంటుంది, ఇది సాంకేతిక సమస్య అయితే కాదని, కేవలం ఉద్యోగుల వార్తలను ప్రజలు చూడకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉదయం నుంచే చాలా చోట్ల కేబుల్ టీవీ ప్రసారాలు ఆపేశారని, గురువారం మధ్యాహ్నం ఉద్యమం పీక్స్ చేరటంతో, చాలా చోట్ల కరెంటు తీసుకుంటూ వస్తున్నారని, సాయంత్రం ఇళ్ళకు వచ్చి టీవీలు పెడతారు కాబట్టి, ఉద్యోగుల ఆందోళన కనిపించకుండా చేయటానికే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కరెంటు పోయింది అంటూ జనాలు పోస్టింగ్ లు పెడుతున్నారు.
సాంకేతిక సమస్యతో కొరత..
ఎన్టీపీసీలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం 800 మెగావాట్ల కొరత తలెత్తిందని.. అందుకే ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, నెల్లూరు, కృష్ణా, గుంటూరుతో నపాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు విధించాల్సి వచ్చిందని ఈపీడీసీఎల్ సీఎండీ సంతోషరావు తెలిపారు. ఇదిలా ఉండగా తమ పరిధిలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని ఎన్టీపీసీ వర్గాలు తెలిపడం గమనార్హం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.