‘రిపబ్లిక్’ సినిమాలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలతో రాజుకున్న రాజకీయ వేడి ఇప్పుడు చికిని చికిని గాలి వానగా మారింది. పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై పోసాని కృష్ణ మురళీ సోమవారం ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై మరో దుమారం రేగింది. పోసాని వ్యాఖ్యలు చేసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ పోసానికి అదే పనిగా ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం చేస్తున్నారని ఆరోపించారు.
ఎంతో దారుణంగా తిడుతున్నారని.. ఇంట్లో ఆడవాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పోసాని చెప్పుకొచ్చారు. ‘పవన్ కల్యాణ్ సైకో ఫ్యాన్లను అదుపులో పెట్టుకో. ఇంట్లో ఆడవాళ్ల గురించి అంత దారుణంగా మాట్లాడుతున్నారు. నీ అభిమానులకు అమ్మలు ఉండరా? అక్కలు ఉండరా? ఇంతే దారుణంగా మాట్లాడతారా? నిన్ను ఎవరు విమర్శిస్తే వారిని అభిమానులతో తిట్టిస్తారా? వారిపై దాడులు చేస్తారా?’ అంటూ తీవ్రంగా విమర్శించారు. పవన్ కల్యాణ్ సైకో అంటూ పోసాని దుర్భాషలాడుతూ ఊగిపోయారు. నా బాధను మీకు చెప్తున్నా అంటూ మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. ‘నీ అభిమానులను అదుపులో పెట్టుకో.. రేపటికల్లా నువ్వు నీ అభిమానులకు గట్టిగా చెప్పుకో వారిని అదుపులో ఉంచుకో.. లేదంటే నేను ఇది ఆపను. ఇది ఇలాగే కొనసాగిస్తా. నువ్వు ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు నేను ప్రశ్నిస్తా’ అంటూ పోసాని సవాలు చేశారు.