రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఓ పది రూపాయల నోటు కనిపిస్తేనే ఠక్కున తీసుకుని జేబులో పెట్టేసుకుంటారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం పరాయి సొమ్మును అస్సలు ఆశించరు. కష్టార్జితమం రూపాయైనా వదులుకోరు, అదే ఇతరుదైతే ఎన్ని లక్షలైనా వద్దనే వ్యక్తిత్వం కాస్త అరుదనే చెప్పాలి. కానీ దీన్ని బలంగా విశ్వసించేవాళ్లు, పాటించేవాళ్లు కూడా ఉన్నారు. పరుల సొమ్ము పాము లాంటిది అనే సామెతను పాటించే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని కొన్ని ఘటనలను చూస్తుంటే అర్థమవుతోంది. గుంతకల్లులో జరిగిన ఓ ఘటనను బట్టి ఇలాంటి అరుదైన వ్యక్తులు ఇంకా ఉన్నారని అనిపించకమానదు. గుంతకల్లుకు చెందిన మల్లికార్జున్ కూడా ఇదే కోవలోకి వస్తాడని చెప్పొచ్చు.
బస్సులు, ఆటోలు, కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు నగలు, డబ్బులను మర్చిపోయిన ఘటనల గురించి వినుంటాం. కొన్నిసార్లు ఏదో ఆలోచనలో ఉండి మర్చిపోవడం లేదా హడావుడిలో ఉండి వెంట తెచ్చుకున్న వస్తువులను మర్చిపోతుంటాం. అయితే ఇలాంటి ఘటనల్లో మర్చిపోయిన వస్తువులను డ్రైవర్లు తిరిగి ఇవ్వడం లేదా పోలీసులకు అప్పగించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రయాణికుల సొమ్మును తిరిగి ఇచ్చేసి మంచి మనసును ఎంతోమంది చాటుకున్నారు. ఆటో డ్రైవర్ మల్లికార్జున్ కూడా అదే కోవలోకి వస్తాడని చెప్పొచ్చు.
గుంతకల్లు పట్టణానికి చెందిన మల్లికార్జున్ అనే ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. అతడి ఆటోలో ప్రయాణించిన పశ్చిమ గోదావరికి చెందిన రాధాకృష్ణ అనే ఓ వ్యక్తి ఒక బ్యాగ్ మర్చిపోయాడు. అందులో 3 తులాల బంగారం, రూ.1,600 నగదు ఉన్నాయి. అయితే ప్యాసింజర్ మర్చిపోయిన ఆ బ్యాగును పోలీసులకు అప్పగించాడు మల్లికార్జున్. ఈ సందర్భంగా నిజాయితీని నిరూపించుకున్న ఆటో డ్రైవర్ మల్లికార్జున్‌ను ఎస్సై మురహరి బాబు అభినందించారు. స్థానికులు కూడా మల్లికార్జున్ నిజాయితీని మెచ్చుకున్నారు.