అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
మండు వేసవి కాలం.. ఎండలు మండి పోతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలవుతోంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బయట అడుగు పెట్టాలంటే.. భయంగా ఉంది. నాలుగు రోజుల క్రితం వరకు భారీ వర్షాలతో చల్లగా మారిన వాతావరణం.. ఇప్పుడు మాత్రం పొగలు కక్కుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ల మీద డ్యూటీలు నిర్వహించడం, ఎండలో పని చేయడం వంటి పనులు చేసే వాళ్లను చూస్తే నిజంగానే పెద్ద సాహసం చేస్తున్నారు అనిపించకమానదు. ఇక ఇలాంటి సమయంలో రాజకీయ నాయకుల పర్యటలను ఉంటే.. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది.. మండుంటెడలో ఎంత ఇబ్బంది పడతారో ఊహించుకోవచ్చు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్బంగా ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సమయంలో పవన్ స్పందనపై జనాలు ప్రశంసులు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం నియోజకర్గంలో పర్యటించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. దాంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండి పోతున్నాయి. ఇక మధ్యాహ్నం ప్రాంతంలో పరిస్థితిని వర్ణించే అవసరం లేదు. దాంతో పవన్ పర్యటనలో పాల్గొన్న అభిమానులు, పోలీసులు తీవ్ర అలసటకు గురైన పరిస్థితి కనిపించింది. ఇక పవన్ పర్యటన నేపథ్యంలో.. అక్కడ విధులు నిర్వహిస్తోన్న పి. గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్.. ఎండ ధాటికి చెమటలు కక్కుతూ కొంత అలసటగా కనిపించారు.
ఇది గమనించిన పవన్ కళ్యాణ్ సీఐ ప్రశాంత్ కుమార్ కు ఎనర్జీ డ్రింకును అందించారు. అది తీసుకున్న సీఐ వెంటనే ఆ డ్రింక్ సేవించి.. కాస్త రిలాక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారికి ఎనర్జీ డ్రింక్ అందిస్తున్న ఫొటో, వెంటనే ఆ డ్రింకును సదరు పోలీసు అధికారి సేవిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది పవన్ కళ్యాణ్ మంచి మనసు అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.