పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా హీరోలకు సామాన్య ప్రజలు ఫ్యాన్స్ అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇది కాస్త విభిన్నంగా ఉంటుంది. సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్‌కి అభిమానులం అని గర్వంగా చెప్పుకుంటారు. రీల్ మీద కన్నా.. వాస్తవంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నచ్చి ఆయనకు ఫ్యాన్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అభిమానులను ఆదుకోవడంలో.. వారిని ఆదరించడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానిని.. కలిసి అతడితో ఫోటో దిగాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ అంటే అతడికి పిచ్చి. ఈ నేపథ్యంలో సత్తిబాబు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రీయాశీలకంగా ఉంటున్నాడు. కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇలా ఉండగా.. కొన్నాళ్ల క్రితం సత్తిబాబు క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం కాకినాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స చేయించుకుంటున్నాడు.
అయితే తన అభిమాన హీరో, నాయకుడైన పవన్ కల్యాణ్‌తో ఫొటో దిగాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాడు సత్తిబాబు. ఈ క్రమంలో ఆదివారం.. కాకినాడ నుంచి అంబులెన్స్‌లో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చాడు సత్తిబాబు. విషయం కాస్త పవన్ కళ్యాణ్‌కు తెలియడంతో.. ఆయన బయటకు వచ్చి అంబులెన్స్ దగ్గరకు వెళ్లి సత్తిబాబుతో మాట్లాడి ఫొటో దిగి అభిమాని కోరిక తీర్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. పవన్ చేసిన పనిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.