సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. వైద్యరంగంలోనూ కొత్త టెక్నాలజీ పరిచయం అవుతూనే ఉంది. ఇటీవలి కాలంలో సర్జరీలు కూడా చాలా సులభం అయిపోయాయి. సాధారణంగా శస్త్ర చికిత్స అంటే మత్తు ఇచ్చి చేస్తారు. సర్జరీ జరిగినంత సేపు రోగి అపస్మారకస్థితిలోనే ఉంటాడు. అయితే కొన్నాళ్ల నుంచి వీలునిబట్టి రోగిని మెలకువగా ఉంచే సర్జరీలు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ సర్జరీల్లో ఈ విషయం చూస్తున్నాం. అంతేకాకుండా సర్జరీ సమయంలో అతనికి నచ్చిన సినిమాలు, మ్యూజిక్, వీడియోలు చూపిస్తూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా గుంటూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ఇసుక త్రిపురవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు(43) ఎనిమిదేళ్లుగా ఫిట్స్(మూర్ఛ) వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా ఫిట్స్ రావడం ఎక్కువైంది. రోజులో రెండు, మూడుసార్లు కూడా వస్తున్నాయట. అలా తరచూ ఫిట్స్ రావడం వల్ల ఆంజనేయులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు. అందుకు సంబంధిచి ఆంజనేయులు వైద్యులను సంప్రదించాడు. ఆంజనేయులుకు మెదడులో 7 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతనికి సర్జరీ చేసేందుకు వైద్యులు నిర్ణయించారు. సర్జరీ చేయించుకునేందుకు ఆంజనేయులు కూడా సరే అన్నాడు.
ఆంజనేయులు సర్జరీ అనగానే భయపడిపోయాడు. అందుకు వైద్యులు ఆంజనేయులు మెలకువగా ఉన్నప్పుడే సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్కాల్ప్ బ్లాక్ ఎనస్థీషియా ఇచ్చి ఈ ఆపరేషన్ చేస్తారు. నవంబర్ 25న గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి హాస్పిటల్స్ లో ఈ ఆపరేషన్ నిర్వహించారు. రోగికి ఇష్టమైన సినిమాలు, వీడియోల గురించి అడగ్గా.. అతని సూపర్ స్టార్ కృష్ణ అగ్నిపర్వతం, సీఎం జగన్ ప్రమాణస్వీకారం వీడియోలు తనకి బాగా ఇష్టమని చెప్పాడు. ఆపరేషన్ జరిగే సమయంలో సీఎం జగన్ ప్రమాణస్వీకారం, కృష్ణ అగ్నిపర్వతం సినిమాలను ల్యాప్‌టాప్‌లో ప్లే చేస్తూ.. ఆంజనేయులుకు వైద్యులు సర్జరీ చేశారు. అతని మెదడులో నుంచి 7 సెంటీమీటర్ల ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, ఆంజనేయులు ఆరోగ్యం కూడా బాగుందంటూ వివరించారు.