ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత, బీజేపీ నేత పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో కళ్లు తిరిగినట్లు అనిపించి కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ మాజీ నేత, పర్చూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురంధరేశ్వరి భర్త అన్న సంగతి విదితమే. ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో కళ్లు తిరిగినట్లు అనిపించి కుటుంబ సభ్యులకు తెలిపారు. స్పందించిన కుటుంబ సభ్యులు ఓ పక్కకు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. సపర్యలు చేశారు. కొంత సేపటికీ కోలుకున్నారు. గతంలోనూ ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో గుండె నొప్పి రావడంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
శని త్రయోదశి కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం మందపల్లి శనీశ్వర స్వామి ఆయంలో పూజలు చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వెళ్లారు. శని దోష నివారణ కోసం తైలాభిషేకం చేస్తుండగా.. కళ్లు తిరిగి, శరీరం తూలినట్లు అనిపించడంతో కుటుంబ సభ్యులకు చెప్పారు. వెంటనే ఆయనను పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కొంత సేపు సేదతీరిన తర్వాత కోలుకున్నారని సమాచారం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆయన పర్చూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజ్యసభ, లోక్ సభ ఎంపీగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర విభజన అనంతరం 2019లో కుమారుడు హితేష్‌తో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే రాజకీయాలకు స్వస్థి పలుకుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు.