చాలా మంది గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకుంటారు. ఫోటోలకు ఫోజులిస్తూ తమని తాము గొప్ప సంఘ సేవకులుగా చెప్పుకుంటారు. ఇలాంటి వారు నిత్యం మనకు అనేక మంది కనిపిస్తుంటారు. కానీ కొందరు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేయికి కూడా తెలియకుండా సాయం చేస్తుంటారు. నిస్వార్ధంతో వారు సేవలు అందిస్తూనే పబ్లిసిటీకి దూరంగా ఉంటారు.. అలాంటి వారిని చూస్తే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. తాజాగా ఓ వ్యక్తి రెండు దశాబ్దాలకు పైబడి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆయనే కడప నగరానికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు గగ్గుటూరు ప్రదీప్‌కుమార్. మరి.. ఆయన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కడప పట్టణంలో ప్రదీప్ కుమార్ అనే వైద్యుడు తన తండ్రిపేరిట శ్రీ గగ్గుటూరు పిచ్చయ్య నేత్ర వైద్యశాలను ఏర్పాటు చేసి… చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎంతో ఓపికగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సేవలు అందిస్తుంటారు. ఈక్రమంలో 2001 నుంచి వారంలో ఒక రోజు పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయడం ప్రారంభించాడు. అలా ప్రతి ఆదివారం ఉచిత కంటి పరీక్షలు, వైద్యం అందించేవారు. ప్రతి శనివారం ఉచిత క్యాంపునకు 60–90 మంది పేషంట్లు వస్తుంటారు. కడప నగరంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి రోగులు వస్తారు. ప్రారంభంలో ఉచిత ఆపరేషన్లు చేశారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అనుమతుల పెండింగ్ లో ఉన్నందున ప్రస్తుతానికి ఆపరేషన్లు నిర్వహించడం లేదు.
ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ..తాను పుట్టి పెరిగింది కడప నగరం ఎర్రముక్కపల్లె. వైద్య పట్టా పుచ్చుకున్నాక తన ఇంటి చుట్టుపక్కల వారికి ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించేవాడని తెలిపారు. ఇప్పుడు కడపకు చెందిన వారేకాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వస్తున్నారని, శుక్లాలు, అద్దాల చెకప్, గ్లాకోమా తదితర కంటి పరీక్షలు నిర్వహిస్తానని డాక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. మరి.. నిస్వార్ధం ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్న ఈ డాక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.