ఏపిలో నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులు ఆమోదించారు. ఇకపై ఆన్ లైన్ లోనే టికెట్ విక్రయం.. ఏపిలో సినిమా హాళ్లలో 4 షోలకు మాత్రమే అనుమతి, అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు ఉంటుందని క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారాజ్యంగా ఆరేడు వేస్తున్నారని, బెనిఫిట్ షోల పేరిట 500- 1000 రూపాయల వరకూ టికెట్ ధరలు పెట్టి వసూలు చేస్తున్నారని మంత్రి పేర్నినాని ఆరోపించారు.
ఆన్ లైన్ టికెటింగ్ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపి ప్రభుత్వం పై బురుద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని.. సినిమా వాళ్లకు ఇబ్బందేమీ లేదని అన్నారు. తక్కువ రేటుకు టికెట్ ధర నిర్ణయించి.. సామాన్యులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. కొన్ని రాజకీయ పార్టీలకు మాత్రం తెగ ఇబ్బంది కలుగుతుందని అన్నారు మంత్రి పేర్ని నాని. సినిమా అనేది అహ్లాదం, మానసిక ఆనందం పొందడం కోసం అని అన్నారు. అయితే కొంతమంది ఇష్టమొచ్చిన రీతిలో టికెట్ ధరలు పెంచుకుంటా పోతున్నారని.. దీని వల్ల సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడే టికెట్ ధరలు నిర్ణయించాల్సి ఉంటుందన్నారు.
ఆన్ లైన్ టికెట్ విధానం ఏర్పాటు చేస్తే అందరికీ ప్రయోజనం ఉంటుందని.. ఎలాగైతే బస్ టికెట్ కోసం అందరికీ ఒకే ఆన్ లైన్ పద్దతిలో బుక్ చేసుకుంటారో.. సినిమా టికెట్ విషయంలో కూడా ఇలాంటి పద్దతి ఉంటే బాగుంటుందని అన్నారు. కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వచ్చిన కలెక్షన్లకూ, జీఎస్టీ చెల్లింపులకు పొంతన లేదన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు యథావిధిగా ఆన్ లైన్ విధానం ద్వారా వస్తాయని మంత్రి పేర్ని తెలిపారు. కొందరు సినిమాహాళ్ల రాబడులు చూపించి అప్పులు తీసుకుంటామని నిందలు వేస్తున్నారని ఆక్షేపించారు. ఆన్ లైన్ పోర్టల్ ను ఏపీ ఫిలిండెవల్పమెంట్ కార్పోరేషన్ నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే.. రాబోయే ఆరు నెలల్లో పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఏపీ సర్కార్ నిర్ణయంతో.. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య, పుష్ప, భీమ్లా నాయక్ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.