ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిదీ భారత్ కాగా, మరొకరి అగ్రరాజ్యం. దేశం కాదూ, భాష కాదూ, సంస్కృతి సంప్రదాయాల్లోనూ భిన్న వైఖరి. అయినప్పటికీ ఆ ఇద్దరి స్నేహం, ప్రేమగా మారింది. పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. ఇంట్లో చెబితే ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇంకేముందీ.
ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లు ఖండాతంరాలు దాటుతున్నాయి. ప్రేమించిన వ్యక్తి పరాయి దేశానికి చెందిన వ్యక్తులైనా సరే తమ ప్రేమను పెళ్లి పీటలు వరకు చేర్చుకుని ఏడడుగులతో ఏకమౌతున్నారు. వధువురుల్లో ఎవరైనా విదేశీయులైనప్పటికీ.. పిల్లలు ఇష్టపడుతుండటంతో పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. ఇటీవల కాలంలో అటువంటి పెళ్లిళ్లను చూశాం. రెండు రోజుల క్రితం యానాంలో తెలుగు అబ్బాయికి, ఫ్రాన్స్ అమ్మాయికి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి నటులు, యాంకర్ రాజీవ్ కనకాల, సుమ దంపతులు వచ్చి ఆశ్వీరదించారు కూడా. తాజాగా మరో ఖండాంతర వివాహం ఒంగోలులో చోటుచేసుకుంది.
ఒంగోలులోని ప్రముఖ హోటల్ అధినేత, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎదుబాటి కొండయ్యనాయుడు, గుణవతి దంపతుల ఏకైక కుమారుడు సాయికిరణ్ ఎనిమిదేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. చదువు అనంతరం ఒహియో స్టేట్ లో సాఫ్ట్ వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.. అక్కడే మరో కంపెనీలో పనిచేస్తున్న అమెరికా వాసి కైలిన్ అలియాస్ కళ్యాణితో( ఈ పెళ్లి కోసం మార్చుకున్న పేరు) పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. అయితే ఈ విషయాన్ని కైలిన్ తన తల్లిదండ్రులైన బి.కర్ట్, అన్నెకు చెప్పింది. ఇటు సాయి కిరణ్ కూడా ఆయన తల్లిదండ్రులకు చెప్పారు.
ఇరు కుటుంబాలు తమ ప్రేమను అంగీకరించడంతో తొలుత అమెరికా సంప్రదాయాల ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. అనంతరం భారత్ లోని ఒంగోలుకు వచ్చిన ఈ జంట తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. అందుకు నగరంలోని గోపాల స్వామి కళ్యాణ మండపం వేదికైంది. అంగరంగా వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి ప్రజా ప్రతినిధులు, నగరంలోని ప్రముఖులు హాజరై..వధూవరూలను ఆశ్వీరదించారు. ప్రేమలు ఎల్లలు దాటి, పెళ్లి పీటలు ఎక్కడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీరి పెళ్లి ఒంగోల్ అంతటా చర్చించుకుంటున్నారు.