కాకినాడలో ఘోర ప్రమాదం జరిగింది. జి. రాగంపేటలోని అంబటి ఆయిల్ కంపెనీలోని ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు మృత్యువాడ పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. గురువారం ఉదయం ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన కార్మికులు ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా గుర్తించారు. మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు వాసులని సమాచారం.
పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్ ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో ట్యాంకర్ లోని ఆయిల్ మొత్తం ఖాళీ చేసి, శుభ్రం చేసేందుకు కార్మికులు అందులోకి దిగారు. అయితే ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించారు. ప్రయత్నాలు విఫలమై ఊపిరాడక ఏడుగురు కార్మికులు ట్యాంకర్ లోనే మరణించారు. మృతదేహాలను బయటకు తీశారు. కృష్ణ, నర్సింహ, సాగర్, బంజుబాబు, రామారావు, జగదీష్ , ప్రసాద్ లుగా గుర్తించారు.