దేశ రాజకీయాలంతా ఒక ఎత్తు.., ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మాత్రం ఒక ఎత్తు అన్న రీతిలో పరిస్థితి తయారైంది. క్యాసినో నిర్వహణ, పీఆర్సీ రగడ కొనసాగుతూ ఉండగానే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుని ప్రకటించింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాకి .. యన్టీఆర్ జిల్లాగా పేరు మార్చారు. ఈ విషయంలో సీనియర్ యన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నా.., టీడీపీ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యుల నుండి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. ఒక్క పురంధేశ్వరి మాత్రమే.. వైసీపీ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇక తాజాగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
“రాష్ట్రంలో ఉన్న సమ్యసల నుండి ప్రజలను పక్కదారి పట్టించడానికే జిల్లాల విభజన అంశం తెరపైకి తెచ్చారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు కాకుండా ఏకపక్షంగా జిల్లాల విభజన చేశారు. కృష్ణా జిల్లాకి యన్టీఆర్ పేరు పెడితే వ్యతిరేకిస్తాం. యన్టీఆర్ ని ఎవరు గౌరవించుకున్నా స్వాగతిస్తాం. కానీ.., హైదరాబాద్ లో ఎయిర్ పోర్టుకు నాడు ఎన్టీఆర్ పేరు తొలగించింది ఎవరు? రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ.., అమరావతిలో ఎన్టీఆర్ స్మృతి వనన్ని ఆపేసింది ఎవరు? చివరికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్నా క్యాంటీలను కూడా ఈ ప్రభుత్వం నిలిపి వేయలేదా? ఈరోజు ఓట్లు కోసం యన్టీఆర్ పై తమకి ప్రేమ ఉందని చెప్తే ప్రజలు నమ్మరు. అయినా.. యన్టీఆర్ అంటే ఓ ప్రాంతానికి పరిమితం అయిన వ్యక్తి కాదు, ఆయనకి భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోంది” అని చంద్రబాబు గుర్తు చేశారు. మరి.. ఈ విషయంలో చంద్రబాబు కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.