ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా బాగా వినిపిస్తున్న ట్రైన్ పేరు ఏదైనా ఉంది అంటే.. అది కచ్చితంగా వందేమాతరం ట్రైనే. మేకిన్ ఇండియా స్పూర్తితో ఈ రైలును తయారు చేశారు. ఇది సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు. కొన్ని రోజుల ముందు వరకు ఇది తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండేది కాదు. 2023 జనవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ – విశాఖపట్టణం మార్గంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ వందే మాతరం రైలు 8.30 గంటల్లో విశాఖపట్టణం చేరుకుంటుంది. స్టాపులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.
ఇక, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వందే మాతరం ట్రైన్ శుభ్రతకు నోచుకోవటం లేదు. రైలులో శుభ్రత కరువైంది. ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా రైలు శుభ్రతను సరిగా పట్టించుకోవటం లేదు. తిన్న లేదా ఉపయోగించిన వస్తువుల్ని ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారు. దీంతో కంపార్ట్‌మెంట్‌లలో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోతోంది. ప్రస్తుతం ట్రైన్‌లో చెత్తకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రైలులో చెత్తను ఇష్టానుసారంగా పడేస్తున్న ఘటనపై వాల్తేరు డీఆర్‌ఎం అనూప్‌కుమార్ మాట్లాడుతూ..
‘‘ రైలును శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత రైలు సిబ్బందిది మాత్రమే కాదు.. ప్రయాణికులది కూడా. రైలు అందరిదీ.. దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రైలు శుభ్రంగా ఉంటేనే అందరికీ గౌరవం’’ అని అన్నారు. రైలులో కుర్చీలు విరిగిపోవటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వందే మాతరం ట్రైన్ శుభ్రతకు నోచుకోకపోవటంపై మీ అబిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.