కొత్త అల్లుడికి అత్తగారింట్లో ఇచ్చే మర్యాద ప్రత్యేకమనే చెప్పాలి. పెళ్లయిన కొత్తలో అల్లుడికి రాచమర్యాదలు మామూలుగా ఉండవు. పండగ సమయాల్లో కొత్త అల్లుళ్లదే హవా అని చెప్పాలి. రకరకాల వంటలు, పిండి వంటలు, స్వీట్లతో భోజనం ప్లేట్లను నింపేస్తుంటారు. ఇక, మర్యాదల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే. కొత్త అల్లుడు వస్తే గోదావరిలో సందడే వేరు. అల్లుడుకు తమ ప్రతిష్టకు తగ్గట్లుగా విందు ఏర్పాటు చేస్తుంటారు.
గత నెల సంక్రాంతి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో కొత్త అల్లుడికి అత్తింటివారు ఏకంగా 173 రకాల వంటకాలను వడ్డించారు. ఇదిలాఉండగా.. గోదారోళ్లే కాదు.. నెల్లూరోళ్లు కూడా మర్యాదల్లో తగ్గేదేలే అంటున్నారు. మర్యాదల్లో తామూ ట్రెండ్ సృష్టిస్తామని అంటున్నారు. నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలంలోని ఊచపల్లిలో కొత్త అల్లుడికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా విందును ఏర్పాటు చేశారు అత్తింటివారు. కొత్త అల్లుడి కోసం ఏకంగా వందకు పైగా వెరైటీలతో రెడీ చేశారు. శాకాహారంతో పాటు మాంసాహారం వరకు అన్నీ ఆ మెనూలో ఉండటం విశేషం. ఊసా శివకుమార్, శ్రీదేవమ్మ దంపతులు ఊచపల్లిలో ఉంటున్నారు. పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు శివకుమార్. తమ కుమార్తె శ్రీవాణిని నెల్లూరులోని బీవీనగర్‌కు చెందిన ఇమ్మడిపల్లి శివకుమార్‌ను ఇచ్చి ఇటీవల ఘనంగా పెళ్లి చేశారు.
ఫస్ట్ టైమ్ ఇంటికి వచ్చిన తమ అల్లుడికి ఘుమఘుమలాడే 108 రకాల వైవిధ్యమైన వంటకాలు తయారు చేసి శివకుమార్, శ్రీదేవమ్మ దంపతులు వడ్డించారు. ఈ ఫుడ్ మెనూలో మటన్, చికెన్, చేపలు, రొయ్యలతో పాటు రసం, సాంబారు, పెరుగు.. రకరకాల పిండి వంటలు, స్వీట్లు ఉన్నాయి. విందు ఆరగింపు సమయంలో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి, కొత్త అల్లుడికి ఇలా రకరకాల వంటకాలతో విందును ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.