తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్య నిషేదాన్ని అమలు చేస్తామంటూ 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 151 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. అయితే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్నా మద్య నిషేదం విషయంలో ఎక్కడి గొంగళి అక్కడ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో దశల వారీగా మద్య నిషేదం తెరపైకి వచ్చింది. మొదటి సంవత్సరం ప్రభుత్వం సక్రమంగా పని చేసింది. తర్వాతి నుంచి ఎలాంటి చర్యలు లేకుండా పోయాయి. మద్యం రేట్లు అయితే పెరిగాయి కానీ, తాగేవాళ్లు మాత్రం తగ్గలేదు.
దానికి తోడు రుచికరమై మద్యం దొరకటం లేదని మందు బాబులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మందు బాబులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైన్ షాపుల్లో మందు బాటిళ్లను కొనే వారి ఫొటోలు తీస్తున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నెల్లూరులోని ఆత్మకూరులో పలు మద్యం షాపుల్లో.. రెండు కంటే ఎక్కువ మందు బాటిళ్లను ఖరీదు చేసిన వారి ఫొటోలు తీస్తున్నారంట. ఎందుకని అడిగితే.. మూడు కంటే ఎక్కువ మద్యం సీసాలు కొన్న వారి ఫొటోలు తీస్తున్నామని వైన్ షాపు వాళ్లు చెబుతున్నారట. తీసిన ఫొటోలను వాలంటీర్లు ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారట. మందు సీసాలు కొని ఇళ్ల దగ్గర అమ్మేవారిని పట్టుకోవటానికి ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ప్రజలు తమ ఫొటోలు తీయటానికి ఇష్టపడకపోవటం, గొడవలకు దిగుతుండటంతో అసలు స్పష్టత రాకుండా పోతోంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సరైన మందు దొరకటం లేదన్న కారణంతో మందుబాబులు పక్క రాష్ట్రాలనుంచి తెప్పించుకోవటమో.. సరిహద్దుల్లో ఉండే వారు పక్క రాష్ట్రంలోకి వెళ్లి తాగి రావటమో చేస్తున్నారు. ఇంకా కొంతమంది రాష్ట్రంలోని షాపుల్లో మూడు, నాలుగు సీసాలు కొని ఇంటి దగ్గర అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బెల్ట్ షాపులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అన్ని రకాలుగా బెల్ట్ షాపుల నిర్మూలనకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఈ కొత్త రూల్ తీసుకువచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక, ఈ వార్తల్లో నిజమెంతుందో తెలుసుకోవాలంటే.. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. మరి, ఈ ప్రచారం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.