ప్రజా ప్రతినిధులంటే నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలి. కొంతమంది ప్రజల సమస్యను తమవిగా భావించే పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారికి కొందరు అధికారుల తీరు అసహనం కలిగిస్తుంది. అధికారుల తీరుకు అనేక విధాలుగా తమ నిరసన తెలియజేస్తుంటారు కొందరు ప్రజాప్రతినిధులు. అలాంటి వారిలో ఒకరు.. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికారుల తీరుకు నిరసనగా మురికి కాలువలోకి దిగి.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాగే మురికి కాలువలోకి దిగి ఎమ్మెల్యే కోటం రెడ్డి నిరసన తెలిపారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని .21వ డివిజన్.. ఉమ్మారెడ్డిగుంటలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మురికి కాలువలోకి దిగి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ..ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న మురుగు నీటితో ఇక్కడ వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఈ సమస్య అనేక సంవత్సరాల నుంచి ఉందని, దీని మీద ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ ఎన్నోసార్లు ప్రశ్నించానని శ్రీధర్ రెడ్డి అన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టేసుకుని సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యకం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా.. అధికారులతో మాట్లాడుతున్నా.. వాళ్లు పట్టించుకోవడం లేదని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారమా? ప్రతిపక్షమా? అనేది ఉండదని.. ప్రజల పక్షమే ఉంటుందని ఆయన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైల్వే అధికారుల మొండి తీరు, కార్పొరేషన్ అధికారులు నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంతలోకి దిగుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికైన అధికారులు వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేనే.. సమస్య పరిష్కారం కాలేదంటూ.. మురికి కాలువలో దిగి నిరసనకు దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.