రైతు కుటుంబంలో జన్మించిన ఆ చిన్నారి.. తన తండ్రి ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గర నుంచి చూసింది. వాటికి ఏదైనా పరిష్కారం చూపాలని భావించింది. ఆ దిశగా ప్రయోగాలు చేసి.. జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కి ఎంపికైంది. ఆ వివరాలు..
ఈ దేశంలో అందరి కంటే ఎక్కువ కష్టపడే ఏకైక వ్యక్తి రైతన్న. మట్టిని నమ్ముకుని బతికే అన్నదాత.. భూతల్లినే కన్నతల్లిగా ప్రేమిస్తాడు.. పంటను కన్న బిడ్డగా భావించి.. దాని రక్షణ కోసం నిత్యం శ్రమిస్తాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా… నిత్యం పొలంలోనే గడుపుతాడు. ఇక మన అధికారులు వాళ్ల ఇష్టా రీతిగా కరెంట్ కట్ చేస్తుండటంతో.. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా కరెంట్ వస్తుండటంతో.. రాత్రి పూట మెలకువగా ఉండి మరి పొలాల దగ్గరకు వెళ్తున్నారు అన్నదాతలు. ఈ క్రమంలో చాలా మంది రైతుల కరెంట్ షాక్, పాము కాటు, విష కీటకాల కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఈ కారణం చేత ఏటా అనేక మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో 9 వ తరగతి చదువుతున్న ఓ రైతన్న బిడ్డ తన తండ్రితో పాటు అనేకమంది అన్నదాతలు ఎదుర్కొనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొని.. జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఆ వివరాలు..
నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథపేటకు చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె భావన స్థానికంగా జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. వారిది వ్యవసాయ కుటుంబం. రైతుగా తన తండ్రి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో కళ్లారా చూసింది భావన. ఇక చిన్ననాటి నుంచి చదువులో చురుకుగా ఉండే భావన.. రైతుగా తన తండ్రి పడుతున్న ఇబ్బందులకు పరిష్కార మార్గం చూపించాలనుకుంది. ఆ దిశగా ప్రయోగాలు చేయసాగింది. ఉపాధ్యాయులు కూడా ఆమెను ప్రోత్సాహించారు. ఈ క్రమంలో తన ఆలోచనలు, ఉపాధ్యాయుల సూచనలతో ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది. తొలుత దీన్ని మండల, జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించింది. విద్యార్థిని ప్రతిభ ప్రతి ఒక్కరిని ఆకట్టకుంది.
ఈ క్రమంలో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో విజయవాడలోని లయోలా కాలేజీలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌లోనూ భావన అభివృద్ధి చేసిన పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి జాతీయస్థాయికి ఎంపికైన 15 మంది విద్యార్థుల్లో భావనకు చోటు దక్కింది. భావన జాతీయ స్థాయికి ఎంపికవ్వడం పట్ల ఆమె చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి పొలానికి వెళ్లేటప్పుడు పడే ఇబ్బందులను కళ్లారా చూసే ఈ పరికరాన్ని తయారుచేసినట్లు భావన చెబుతోంది.
ఇక భావన అభివృద్ధి చేసిన పరికరం ఎలా పని చేస్తుంది అంటే.. రైతులు పొలాల్లో నడుస్తున్న సమయంలో ఈ మిషన్ చేతిలో ఉంటే.. వారి సమీపంలో ఎక్కడైనా కరెంటు తీగలు పడివున్నా, పాములు, విష పురుగులు కదలికలు ఉన్నా వెంటనే సైరన్ మోగుతుంది. దీనికి ఏర్పాటుచేసిన లైట్.. టార్చిలా ఉపయోగపడుతుంది. అంతేకాక ఈ పరికరం చివరన అమర్చిన కటర్‌తో పొలాల్లో పిచ్చిమొక్కలను సైతం తొలగించుకునే సౌకర్యం కూడా ఉంది. తన కష్టాన్ని చూసి భావన తయారుచేసిన పరికరంపై ఆమె తండ్రి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విద్యార్థిని ప్రతిభపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.