అన్ని సౌకర్యాలు అమర్చి.. చదువుకోవడానికి కావాల్సినవన్ని ఏర్పాటు చేసినా సరే.. చాలా మందికి చదువు మీద ఆసక్తి ఉండదు. కానీ కొందరికి చదువు అంటే ప్రాణం.. చిన్న అవకాశం లభించినా సరే.. చదువుకోవాలని భావిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే.. ధైర్యంగా ముందుకు వెళ్తారు. అనుకున్న గమ్యం సాధిస్తారు. తాజాగా ఓ రైతు బిడ్డ ఇలాంటి విజయమే సాధించాడు. ఆరుగాలం కష్టం చేసినా.. ఇంట్లో మాత్రం పేదరికమే. ఈ కష్టాలన్నింటికి సమాధానం చదువు అని బలంగా నమ్మాడు. అందుకే శ్రద్ధగా చదివి.. మంచి ప్యాకేజ్‌తో గొప్ప కొలువులో చేరి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఆ యువకుడి జీవితం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆ విజేత ఎవరంటే..
ఓ సాధారణ రైతు కుమారుడు భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. ఏకంగా ఏడాదికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో కొలువు దక్కించుకున్నాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాత జంగాలపల్లికి చెందిన చిన్నకారు రైతు ఈగ మురళీమనోహర్‌రెడ్డి- లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకటసాయికృష్ణారెడ్డి ఈ ఘనత సాధించాడు. తల్లిదండ్రుల కష్టం చూస్తూ పెరిగిన వెంకటసాయి కృష్ణారెడ్డి చదువులో ముందుండేవాడు. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాడు. ప్రస్తుతం ఖరగ్‌పూర్ ఐఐటీలో ఈసీఈ చదువుతున్న సాయికృష్ణారెడ్డి ఏకంగా 92 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు.
నాలుగో ఏడాది చదువుతుండగానే ఇంటెల్ సంస్థలో కొలువు సాధించాడు వెంకటసాయికృష్ణారెడ్డి. ఇటీవల ఖరగ్‌పూర్ ఐఐటీలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి ఏకంగా రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. కుమారుడికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణ రైతు కుటుంబం నుంచి వెళ్లి ఉన్నతస్థాయికి వెళ్లబోతున్న సాయికృష్ణారెడ్డిని స్థానికులు అభినందించారు. యువత అతడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మరి సాయికృష్ణారెడ్డి సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.