టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంది. ఆదోనీ టౌన్ చేరుకోగానే ఆయన అభిమానులు పెద్ద యెత్తున నినాదాలు చేశారు. అయితే ఈ సమయంలో ప్రతిపక్ష నేతలను లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
గత ఎన్నికల్లో కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకున్న టీడీపీ.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది.. తిరిగి అధికారాన్ని చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. జనవరి 27న పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్లు పాదయాత్రను నారా లోకేశ్ పూర్తి చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఆయన ఈ పాద యాత్ర చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 400 రోజుల పాటు 4 వేల కిమీ మేర యాత్ర చేపడుతున్నారు.
77 రోజుల్లో 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగింది. ప్రతి వంద కిలో మీటర్లకు ఆ ప్రాంతానికి లోకేష్ ఒక్కో హామీ ఇచ్చారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని టౌన్‌కు చేరుకునే సరికి వెయ్యి కిలో మీటర్లు పూర్తయ్యాయి. దీంతో ఆదోని టౌన్ వార్డు 21ని దత్తత తీసుకోవాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు సగటున 13 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. కాగా, ఈ రోజు పర్యటనలో భాగంగా ఓ ఆసక్తి కర సన్నివేశం జరిగింది. ఆదోనీ టౌన్ చేరుకోగానే ఆయన ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. పెద్ద యెత్తున ఆయన అభిమానులు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏమీ మాట్లాడకుండా కేవలం తన సైగలతో హెచ్చరికలు చేశారు. మీసం మేలేసి, వేలు చూపిస్తూ మరీ మాస్ వార్నింగ్స్ ఇచ్చారు.