నారా లోకేష్ రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. యువగళం పేరిట పాదయాత్ర చేపట్టిన లోకేష్.. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా యువత, రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
టీడీపీ ముఖ్య నాయకుడు, యువ నేత నారా లోకేష్.. పార్టీని బలోపేతం చేయడమే కాక.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. దీనిలో భాగంగా.. ఇర్రంగారిపల్లిలో యువతీ, యువకులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందంటూ విమర్శించారు. అంతేకాక టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని మారుస్తామని.. ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు లోకేష్. అలానే టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని.. రాసిపెట్టుకొండి ఇది సత్యమని స్పష్టం చేశారు లోకేష్.
ముఖాముఖిలో భాగాంగా ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు.. అంతేకాక ఆమె ఇచ్చిన ఐడియా తనకు ఎంతో నచ్చిందని.. సదరు విద్యార్థిని ఇచ్చిన ఐడియాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు లోకేష్. కాలేజీ బస్సు ఫీజు కట్టలేకపోతున్నాము అని తెలిపిన సదరు విద్యార్థిని.. దాని బదులు ఆర్టీసీ బస్సుల్లో రావాలంటే ఛార్జీలు పెరిగాయన్నారు. అంతేకాక ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం పదో తరగతి వరకే ఫ్రీ బస్ పాసులు ఇస్తున్నారని తెలిపింది. ఈ సమస్యకు టీడీపీ పరిష్కారం చూపగలదా.. మీ పార్టీ అధికారంలోకి వస్తే ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఫ్రీ బస్ పాసులు ఇవ్వగలరా అని ప్రశ్నించింది.
సదరు విద్యార్థిని అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం చెబుతూ.. కచ్చితంగా పాస్‌లు ఇస్తామని.. అంతేకాక నీ ఐడియా బావుంది.. దీన్ని వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో చేరుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఐడియా ఎవరు ఇచ్చారనేది కాదు, అది జనానికి ఉపయోగపడేదా కాదా అన్నదే తనకు ముఖ్యం అన్నారు లోకేష్. ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించడంతో పాటు ఇంజనీరింగ్‌తో సహా ఉన్నత విద్య చదివే అందరికీ ఉచితంగా బస్సు పాస్‌లు అందిస్తామని తెలిపారు లోకేష్.
తాము అధికారంలోకి వస్తే.. స్వయం ఉపాధికి పెద్ద పీట వేస్తామని.. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రత్యేకంగా కేటాయిస్తామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. అంతేకాక కేజీ నుంచి పీజీ వరకూ సిలబస్‌ని ప్రక్షాళన చేస్తామని.. విద్యార్థులు చదువుకునే రోజుల్లోనే వారిని రెడీ టూ జాబ్ యూత్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకూ ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతామని.. మహిళలు ఎదుర్కొనే కష్టాలు, వారి గొప్పతనం, విలువ తెలిసేలా విద్యార్ధి దశ నుంచే మహిళల్ని గౌరవించే విధంగా సిలబస్ మారుస్తామని తెలిపారు. మరి బస్‌పాస్‌ల విషయంలో లోకేష్ ఇచ్చిన హామీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.