ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం… ప్రస్తుత ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్ గా మారింది. వర్సిటీ పేరు మార్చే బిల్లుకు ఏపీ అసెంబ్లీ, బుధవారం ఆమోదం తెలిపింది. అయితే జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష తెదేపా నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ ఈ విషయమై ట్వీట్ చేయగా, అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారిస్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు’ అని తారక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ గురించి అందరూ చర్చించుకుంటుండగానే.. హీరో కల్యాణ్ రామ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
‘1986లో విజయవాడలో మెడికల్ యూనివర్సిటీ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మహావిద్యాలయానికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది. లెక్కలేనన్ని నైపుణ్యం కలిసి వైద్య నిపుణులని దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు వర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరు మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలామందికి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు’ అని కల్యాణ్ రామ్ రాసుకొచ్చారు. మరి అన్నదమ్ములు.. హెల్త్ యూనివర్సిటీ గురించి చేసిన ట్వీట్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 22, 2022
ఇదీ చదవండి: వర్సిటీకి NTR పేరు తొలగించడంపై స్పందించిన తారక్