పొద్దునే రోడ్డు మీదకు వచ్చిందీ మొదలు.. రాత్రి ఇంటికి చేరుకునే సరికి అనేక సమస్యలను చవిచూస్తున్నాడు ఆటో డ్రైవర్. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు వేసే చలానాతో అతడి శ్రమను దోచుకుంటున్నట్లు అవుతుంది. ఇంటికి వెళ్లే సరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదు. దీనిపై ఫోకస్ చేసిన జర్నలిస్ట్.. ఓ ఎంపీకి వినూత్నంగా ఛాలెంజ్ విసిరారు. ఇంతకు ఆయన అంగీకరించారా..
దేశంలో కార్మిక, కర్షకులు ఎంతో మంది ఉన్నారు. రైతు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడో.. సగటు కార్మికుడు కూడా తన రెక్కల కష్టంతోనే బతుకు ఈడుస్తున్నాడు. ఈ కార్మికుల్లో ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. పొద్దునే రోడ్డు మీదకు వచ్చిందీ మొదలు.. రాత్రి ఇంటికి చేరుకునే సరికి అనేక సమస్యలను చవిచూస్తున్నాడు ఆటో డ్రైవర్. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు వేసే చలానాతో అతడి శ్రమను దోచుకుంటున్నట్లు అవుతుంది. దీనికి తోడు ఫైనాన్సర్ల వేధింపులతో మానసిక వేదనకు గురౌతున్నారు. అంతే కాకుండా ఆటో యజమానులు వసూలు చేసే కిరాయితో పాటు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు మండిపోతుండటంతో ఇంటికి చిల్లగవ్వ తీసుకెళ్లలేని పరిస్థితి అద్దె ఆటో డ్రైవర్లది.. ఈ పరిస్థితిపై ఫోకస్ చేసిన ప్రముఖ జర్నలిస్ట్.. ఎంపీ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వద్దకు తీసుకెళ్లి.. చాలెంజ్ విసిరారు. భరత్‌ను మాత్రమే ఎంచుకోవడానికి కారణం.. జరిమానాలు, చలానాలు కేంద్ర ప్రభుత్వం కిందకు వర్తించనున్న నేపథ్యంలో ఆయనను కలిసి.. చాలెంజ్ చేశారు. ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాలని, వంద రూపాయలతో రోజంతా గడపాలని టాస్కులు జర్నలిస్ట్ ఇవ్వడంతో అందుకు అంగీకరించాడు. మారు వేషంలో సామాన్య ఆటో డ్రైవర్‌లా మారిన ఎంపీ..ఖాకీ దుస్తులు ధరించి ఆటో కార్మికుడిగా మారిపోయారు. కస్టమర్లను ఎక్కించుకుంటూనే.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను చవిచూశాడు. అడుగు అడుగునా ట్రాఫిక్ పోలీసులు పలుమార్లు ఆయనను అడ్డుకున్నారు. ఆర్టీఓ అధికారులు యక్ష ప్రశ్నలు వేశారు.
అలాగే టాస్కులో భాగంగా సామాన్యుడిలా రోడ్డు ప్రక్కన భోజనం, డిన్నర్ చేశాడు. మరుసటి రోజు మరో ప్రాంతంలో సంచరించాడు. మొత్తం మీద 630 రూపాయలు సంపాదించాడు. ఖర్చులు మినహాయించి 400 నుండి 500 సంపాదనతో ఆటో డ్రైవర్ బతకడం కష్టమని భావించిన మార్గానీ భరత్.. ఆర్టీ అధికారులు, బ్యాంకర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆటో డ్రైవర్లకు, వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తానని హామీనిచ్చారు. పర్మిట్ లేకుండా ఆటో నడిపితే.. 10 వేలు ఫైన్ వేస్తున్నారని, అదేవిధంగా లోన్లు తీసుకున్న బ్యాంకర్లు పీల్చిపిప్పి చేస్తున్నారని ఆటో కార్మికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అంతా విన్న ఆయన.. బ్యాంక్ అధికారులు, ఆర్టీఓ అధికారులతో చర్చించారు. అయితే నేషనల్, లోకల్ బ్యాంకు నుండి 70 శాతం అప్పు ఇప్పించేందుకు, ఇఎస్ఐ బెనిఫిట్స్ ఆటో కార్మికులకు వర్తించే విధంగా, అంతేకాకుండా ఇతర లోన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద జాయింట్ షూరిటీ పద్దుతుల్లో ఆటో రుణాలు, బాధిత కుటుంబాలకు హెల్త్ ఇన్సురెన్సులు ఇప్పించడం, అంతేకాకుండా ఫైన్లను తగ్గించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పడం వంటి టాస్కులు పూర్తి చేశారు. మొత్తానికి ఎంపీ ఈ టాస్కులో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.