మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్నవాడు.. అంటూ ప్రముఖ కవి అందెశ్రీ అన్నట్లు.. ఈ కాలంలో డబ్బుకు ఉన్న విలువ మానవ సంబంధాలకు లేవని తెలిపే ఓ దారుణ ఘటన నాగర్ కర్నూల్ లో వెలుగు చూసింది. నవమాసాలు కనీ పెంచి పెద్ద చేసి ఓ తల్లిని కూతురు డబ్బు కోసం నడి వీధిలో తిట్టుకుంటూ.. దారుణంగా కొడుతూ కర్కశంగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నాగర్ కర్నూల్ కి చెందిన చంద్రమ్మ అనే ఓ వృద్ద మహిళకు ఒక్కతే కూతురు. కొంత కాలంగా ఆమె ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ తో కూతురు వద్ద జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తనకు డబ్బులు అవసరం ఉన్నాయని.. పింఛన్ మొత్తం కావాలని చంద్రమ్మను అడిగింది కూతురు. అంతేకాదు ఆమె కాళ్ల కడియాలు కూడా కావాలని బలవంతం చేసింది.. అందుకు అంగీకరించకపోవడంతో కోపంతో ఊగిపోయిన చంద్రమ్మ కూతురు ఆమెను నడివీధిలోకి ఈడ్చుకుంటూ వచ్చి బండ బూతులు తిడుతూ కొట్టింది. తల్లి వృద్దాప్యంలో ఉందన్న కనికరం కూడా లేకుండా రాళ్లతో కొట్టి.. తన్నుతూ చిత్ర హింసలకు గురి చేసింది. ఈ తతంగాన్ని అక్కడ ఉన్నవాళ్లు వీడియో తీశారు.
వృద్దురాలైన చంద్రమ్మను కొడుతుంటే కొంత మంది ఆపడానికి ప్రయత్నించగా వారిపై దుర్భాషలాడుతూ మీ పని చూసుకోండి అంటూ బెదిరించింది. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నా కూడా నా ఇష్టం అంటూ మరింత రెచ్చిపోయింది. ఆ దృశ్యాలను సహించలేక కొంత మంది అక్కడకు వచ్చి చంద్రమ్మను రక్షించి.. పోలీసులకు సమాచారం అందించారు. అయితే కన్నతల్లిని కొడుతుంటే ఆమె అల్లుడు పక్కనే నిల్చుని చోద్యం చూస్తూ ఉన్నాడు. డబ్బు కోసం కన్నతల్లిని దారుణంగా హింసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఆ కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.